అన్నాడీఎంకే మెడకు కర్ణాటక ఉచ్చు | AIADMK Cauvery water dispute | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే మెడకు కర్ణాటక ఉచ్చు

Oct 11 2014 11:56 PM | Updated on Sep 27 2018 8:27 PM

అన్నాడీఎంకే మెడకు కర్ణాటక ఉచ్చు - Sakshi

అన్నాడీఎంకే మెడకు కర్ణాటక ఉచ్చు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన పాలనలో ఒకింత దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏ అంశంలోనూ ప్రతిపక్షాల

 చెన్నై, సాక్షి ప్రతినిధి : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తన పాలనలో ఒకింత దూకుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏ అంశంలోనూ ప్రతిపక్షాల నోటికి చిక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు అన్ని కోణాల్లో మేలు చేయడం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేదే పైచేయిగా నిలవాలని అమ్మ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే అనేక అంశాలతోపాటు కావేరీ జలాల వివాదాన్ని నెత్తికెత్తుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డి అడ్డుకున్నా ఎట్టకేలకు జయ పైచేయి సాధించి గెజిట్‌లో సైతం పొందుపరిచేలా చేశారు. రాష్ట్రంలో సహజంగానే అమ్మ ప్రతిష్ట ఆకాశానికి ఎగిసింది. ఇది కర్ణాటకకు కంటగింపుగా మారింది. అయితే సరిగ్గా ఇదే సమయంలో బెంగళూరు ప్రత్యేక కోర్టులో ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ముగిసింది.
 
 జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పువెలువడి సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి జైలు శిక్షపడటంతోపాటు కోర్టు చరిత్ర ఎన్నడూ లేని విధం గా భారీ స్థాయిలో జరిమానా విధించడం ఏమిటని అన్నాడీఎంకే శ్రేణులు ఆగ్రహంతో ఊగిపోయాయి. కావేరీ జలాల వివాదం నేపథ్యంలోనే జయలలితకు జైలు శిక్ష వేసారంటూ తీర్పు వెలువడిన ఈనెల 7వ తేదీనే గుసగుసలాడారు. అన్నాడీఎంకే శ్రేణులు క్రమేణా పూర్తిస్థాయిలో బైటపడుతూ ఏకంగా చెన్నై గోడలపై పోస్టరునే వేసేశారు. జయకు బెయిల్ ఇవ్వకుంటే తమిళనాడులో నివసిస్తున్న కన్నడిగులను జైల్లో పెడతాం అంటూ మంత్రి వలర్మతి, టీ.నగర్ ఎమ్మెల్యే కలైరాజన్ తదితర నేతల పేర్లతో పోస్టర్ల వెలిశాయి. జయకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైకేల్ డీ గున్హ దిష్టిబొమ్మలను రాష్ట్రంలో దహనం చేశారు.
 
 వేలూరు కార్పొరేషన్‌లో న్యాయమూర్తి గున్హను విమర్శిస్తూ తీర్మానం చేశారు. అంతేగాక  కర్ణాటకు హైకోర్టులో నింది తులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి రత్నకళ, బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయమూర్తి ఏవీ చంద్రశేఖర్‌ను తీవ్రంగా విమర్శించినట్లు  కర్ణాటక  న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఇదిలాఉండగా చెన్నైలో  కర్ణాటకు న్యాయస్థానాన్ని విమర్శిస్తూ కొత్త పోస్టర్ వెలిసిం ది. ‘కావేరి తల్లీ..ప్రతీకారం తీర్చుకుంది.. కర్ణాటక న్యాయస్థానం, తల్లిలేక తమిళనాడు తల్లడిల్లిపోతోంది, విడుదల చేయ్...అమ్మను విడుదల చేయ్’ అంటూ టీనగర్ శాఖ పార్టీ నేతలు పోస్టర్లు వేశారు. కార్ణాటక న్యాయస్థానాలకు వ్యతిరేకంగా తమిళనాడులో వెలుస్తున్న పోస్టర్లపైనా, న్యాయమూర్తులను నిరసిస్తూ సాగుతున్న ఆందోళనపైనా కర్ణాటక న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
 న్యాయస్థానాన్ని అవమానానికి గురిచేస్తున్న అన్నాడీఎంకే నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బెంగళూరుకు చెందిన సీనియర్ న్యాయవాది ధర్మపాల్.. కర్ణాటక ప్రధాన న్యాయవాది రవికుమార్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. జయ అనుచరులపై చట్టపరమైన చర్యల సాధ్యాసాధ్యాలపై కర్ణాటక న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని రవికుమార్ ఆయనకు హామీ ఇచ్చారు. కావేరీ జలలా వివాదం నేపథ్యంలోనే న్యాయస్థానం ద్వారా కన్నడిగులు అమ్మపై ప్రతికారం తీర్చుకున్నారని అన్నాడీఎంకే నేతలు గట్టిగా విశ్వసిస్తున్న తరుణంలో తాజా పరిణామాలు ఏవైపు దారితీస్తాయోనని కలవరపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement