నగరంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మహమ్మారి 11 మందిని బలి తీసుకుంది.
సాక్షి, ముంబై: నగరంలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మహమ్మారి 11 మందిని బలి తీసుకుంది. అనేక మంది వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. దీనిని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. దీనిని అరికట్టేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని మేయర్ సునీల్ ప్రభు కోరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బీఎంసీ ఆరోగ్య విభాగం అనేక ప్రయత్నాలు చేస్తోందని బీఎంసీ కమిషనర్ సీతారామ్ కుంటే తెలిపారు. ఈ వ్యాధికి కారణమవుతున్న దోమలు ఉత్పత్తి చెందకుండా ప్రజలు కూడా జాగ్రత్త వహించాలని కోరారు.
నగరంలో సుమారు 11,349,000 భవనాలు ఉన్నాయి. అలాగే 960 విద్యా సంస్థలు, ఆరు వేల కార్యాలయాలు, ఉద్యోగ కంపెనీల భవనాలు ఉన్నాయి. వీటివద్ద ఆరోగ్య విభాగ బృందాలు పనిచేస్తున్నాయి. ముంబైలోని ధనవంతులు నివసించే కాంప్లెక్స్‌లలో కూడా గత నాలుగు నెలల నుంచి దోమలు వ్యాపించడం పెరిగిందని అదనపు కమిషనర్ మనీషా మైస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు చెందిన 50 క్లినిక్‌లలో జ్వరం, డెంగీ వ్యాధి సోకిన వారికి చికిత్స అందించే సదుపాయాలు, ఏర్పాట్లు ప్రారంభించామని చెప్పారు. డెంగీని అరికట్టడం కోసం కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని నియమించనున్నామని
చెప్పారు. ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు 11 మంది మృతి చెందారని వెల్లడించారు. 698 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇంట్లో, ఆవరణలో, అలాగే అలంకారమైన వస్తువుల్లో నీరు నిలవకుండా జాగ్రత్త పాటించాలని ఆమె సూచించారు. పరిశుభ్రతపై నిర్లక్ష్యం చేస్తున్న 570 సొసైటీలతో పాటు వివిధ సంస్థలకు నోటీసులు పంపించామన్నారు. వారికి జరిమానా విధిస్తామని తెలిపారు.