క్వార్టర్స్‌లో శివ థాపా, మనోజ్ | World boxing championship: Shiva Thapa, Manoj Kumar enter quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో శివ థాపా, మనోజ్

Oct 22 2013 12:53 AM | Updated on Sep 1 2017 11:50 PM

క్వార్టర్స్‌లో శివ థాపా, మనోజ్

క్వార్టర్స్‌లో శివ థాపా, మనోజ్

మరో విజయం లభిస్తే... ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది.

అల్మాటీ (కజకిస్థాన్): మరో విజయం లభిస్తే... ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమవుతుంది. 56 కేజీల విభాగంలో భారత రైజింగ్ స్టార్ శివ థాపా... 64 కేజీల విభాగంలో మనోజ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో శివ 2-1 (28-29, 29-28, 30-27)తో అల్బెర్టో మెలియన్ (అర్జెంటీనా)పై... మనోజ్ 2-1 (28-29, 29-28, 29-28)తో యువెస్ ఎలిసెస్ (కెనడా)పై విజయం సాధించారు. తొలి రౌండ్‌ను కోల్పోయిన శివ రెండో రౌండ్‌ను పాయింట్ తేడాతో గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. 
 
 ప్రస్తుత ఆసియా చాంపియన్‌గా ఉన్న ఈ అస్సాం బాక్సర్ కీలకమైన మూడో రౌండ్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి విజయం నమోదు చేశాడు. శివ థాపా మాదిరిగానే మనోజ్ కూడా తొలి రౌండ్‌ను చేజార్చుకొని తర్వాతి రెండు రౌండ్లలో నెగ్గి ముందంజ వేశాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో జావిద్ చలాబియెవ్ (అజర్‌బైజాన్)తో శివ; యాస్నియెర్ లోపెజ్ (క్యూబా)తో మనోజ్ పోటీపడతారు. ఈ బౌట్‌లలో గనుక శివ, మనోజ్‌లు గెలిస్తే వారికి కనీసం కాంస్య పతకాలు లభిస్తాయి. ప్రపంచ సీనియర్ బాక్సింగ్ పోటీల చరిత్రలో విజేందర్ (2009లో), వికాస్ కృషన్ (2011లో) భారత్‌కు కాంస్య పతకాలు అందించారు.
 
  ‘అల్బెర్టోతో పోరు చాలా హోరాహోరీగా సాగింది. నా శక్తినంతా ధారపోయాల్సి వచ్చింది. తొలి రౌండ్‌లో నిదానంగా ఆడటంతో వెనుకబడిపోయాను. అయితే తర్వాతి రెండు రౌండ్లలో దూకుడు పెంచాను’ అని శివ థాపా వ్యాఖ్యానించాడు. మరోవైపు 49 కేజీల విభాగంలో ప్రపంచ క్యాడెట్ మాజీ చాంపియన్ తోక్‌చమ్ నానో సింగ్... 91 కేజీల విభాగంలో మన్‌ప్రీత్ సింగ్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నానో సింగ్ 0-3 (27-30, 28-29, 28-29)తో ఆంథోనీ రివెరా (ప్యూర్టోరికో) చేతిలో; మన్‌ప్రీత్ 0-3 (27-30, 27-30, 27-30)తో టాప్ సీడ్ తెమూర్ మమదోవ్ (అజర్‌బైజాన్) చేతిలో ఓడిపోయారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement