ప్రపంచ కప్‌  జట్టు కోసం...

Womens T20 World Cup to be held in Australia - Sakshi

భారత మహిళల టి20 సన్నాహాలు

నేటి నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్‌

గువాహటి: సరిగ్గా సంవత్సరం తర్వాత మహిళల టి20 ప్రపంచ కప్‌ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనుంది. అయితే ఆలోగా భారత జట్టు ఆడబోయే పరిమిత టి20 మ్యాచ్‌ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి పెట్టాల్సిన స్థితి నెలకొంది. కాబట్టి వచ్చే ఏడాదిలోగా ప్రతీ టి20 టోర్నీ భారత్‌కు సన్నాహకంలాంటిదే. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు భారత్‌ సన్నద్ధమైంది. నేడు ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు ఇక్కడి బర్సపర స్టేడియం వేదిక కానుంది. దీనికి ముందు ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న భారత్‌ ఉత్సాహంగా కనిపిస్తోంది. అయితే టి20 ఫార్మాట్‌లో మన జట్టు అంత బలమైనదేమీ కాదు.

ఇటీవలే న్యూజిలాండ్‌ గడ్డపై 0–3తో భారత్‌ చిత్తయింది. ఈ నేపథ్యంలో మన జట్టు బలాన్ని పరీక్షించుకునేందుకు ఇది సరైన సిరీస్‌ కానుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ గాయం కారణంగా దూరం కావడంతో స్మృతి మంధాన తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించబోతోంది. ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి నాయకురాలిగా కూడా తన సత్తా నిరూపించుకోవాలని పట్టుదలగా ఉంది.  మరోవైపు ఈ సిరీస్‌ తర్వాత తన టి20 కెరీర్‌ భవిష్యత్తును నిర్ణయించుకోనున్న వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ రాణించడం కూడా జట్టుకు ఎంతో అవసరం. న్యూజిలాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు ఆడని మిథాలీ చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగినా జట్టును గెలిపించలేకపోయింది.

టి20 ప్రపంచకప్‌లో విఫలమైన తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన వేద కృష్ణమూర్తి పునరాగమనం చేస్తోంది. ఆమె ఎలా రాణిస్తుందనేది చూడాలి. ఐదుగురు స్పెషలిస్ట్‌ స్పిన్నర్లు ఉన్న జట్టులో పేసర్‌గా శిఖా పాండే ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంది. కొత్త ప్లేయర్లలో హర్లీన్‌ డియోల్, భారతి ఫుల్మాలి, కోమల్‌ తమ ప్రతిభను ప్రదర్శించాలని ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ హీతెర్‌ నైట్, బీమంట్, బ్రంట్, ష్రబ్‌సోల్, వ్యాట్‌లకు పొట్టి ఫార్మాట్‌లో మంచి అనుభవం ఉంది. వన్డే సిరీస్‌ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న ఆ జట్టు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top