తేజస్విని ‘టోక్యో’ గురి

Women's Star Shooter Tejaswini Confirmed Her Berth In Tokyo Olympic - Sakshi

భారత్‌కు 12వ ఒలింపిక్‌ బెర్త్‌ అందించిన మహిళా స్టార్‌ షూటర్‌

దోహా (ఖతర్‌): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత మహిళా సీనియర్‌ స్టార్‌ షూటర్‌ తేజస్విని సావంత్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో 39 ఏళ్ల ఈ మహారాష్ట్ర షూటర్‌ 1171 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అందుబాటులో ఉన్న రెండు బెర్త్‌లలో ఒకటి భారత్‌కు, మరోటి జపాన్‌ (షివోరి)కు లభించాయి. ఫైనల్లో తేజస్విని 435.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. 2010లో 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా గుర్తింపు పొందిన తేజస్వినికి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు.

ట్రయల్స్‌ లేకపోతే మాత్రం... ఆమె ఒలింపిక్‌ కల ఈసారి సాకారం అవుతుంది. ట్రయల్స్‌ నిర్వహిస్తే తేజస్విని అందులో నెగ్గాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్‌ నుంచి 12 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. తేజస్విని, కాజల్, గాయత్రిలతో కూడిన భారత బృందానికి 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్యం దక్కింది. పురుషుల 25 మీటర్ల సెంటర్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో గుర్‌ప్రీత్‌ సింగ్‌ 586 పాయింట్లతో రజతం నెగ్గగా... గుర్‌ప్రీత్, యోగేశ్, ఆదర్శ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం గెలిచింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top