చాంపియన్‌ ఆనంద్‌ 

Viswanathan Anand Seals Blitz Title in Style by Beating Hikaru Nakamura - Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ ఇండియా అంతర్జాతీయ బ్లిట్జ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ విజేతగా నిలిచాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 18 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఆనంద్, హికారు నకముర (అమెరికా) 12.5 పాయిం ట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే విజేతను నిర్ణయించడానికి వీరిద్దరి మధ్య టైబ్రేక్‌ను నిర్వహించగా... ఆనంద్‌ 1.5–0.5తో నకమురను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. టైబ్రేక్‌ తొలి గేమ్‌లో ఆనంద్‌ 55 ఎత్తుల్లో గెలిచాడు.

రెండో టైబ్రేక్‌ గేమ్‌ను అతను 72 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. నిర్ణీత 18 రౌండ్లలో ఆనంద్‌ తొమ్మిది విజయాలు సాధించి, ఏడింటిని ‘డ్రా’గా ముగించి, రెండింటిలో ఓడిపోయాడు. విజేతగా నిలిచిన ఆనంద్‌కు 7,500 డాలర్ల (రూ. 5 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ, విదిత్‌ 8 పాయింట్లతో సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... హరికృష్ణకు ఆరో స్థానం, విదిత్‌కు ఏడో స్థానం దక్కింది. సూర్యశేఖర గంగూలీ 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో పదో స్థానంలో నిలిచారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top