అవే నన్ను రాటుదేలేలా చేసాయి : కోహ్లి

Virat Kohli Reveals How He Dealt With Heartbreak of Losing World Cup Semi Final - Sakshi

న్యూఢిల్లీ : కెరీర్‌లోని వైఫల్యాలు, ఎదురుదెబ్బలే తనను మరింత రాటుదేలేలా చేసాయని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపాడు. ప్రపంచకప్‌ ఓటమి అనంతరం టైమ్స్‌ నౌకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడుతూ.. వైఫల్యాలే తనను మనిషిగా మెరుగుపర్చాయని చెప్పుకొచ్చాడు. ‘నా జీవితంలోనే వైఫల్యాలు, ఎదురుదెబ్బలతోనే చాలా నేర్చుకున్నాను. వీటి నుంచి స్పూర్తిపొందడమే కాకుండా ఓ మనిషిగా కూడా మెరుగయ్యాను. విజయాల కంటే వైఫల్యాల ప్రాముఖ్యతను నాకు అర్థమయ్యేలా చేసిన సందర్భాలు కూడా ఇవే. కావాల్సిందేదో తెలుసుకునేలా.. ప్రణాళికలు రచించుకునేలా చేసాయి. అలాగే  మద్దతుగా ఉండే వ్యక్తులు ఎవరు? తప్పుకునేవారు ఎవరని కూడా తెలియజేసాయి. మనం ఎదుగుతున్న సమయంలో అకస్మాత్తుగా జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని కుంగదీస్తాయి.

ప్రతీ ఒక్కరు బాగా ఆడుతున్నా మనం ఆడలేకపోతాం. మనం ఏ తప్పు చేయలేదని మనకు తెలుస్తోంది. కానీ తోటి ఆటగాళ్లు మాత్రం మనల్ని మించిపోతారు. ఇలాంటి విషయాలు జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. మనం ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఒకొక్కసారి ఓడిపోవడం జరుగుతుంది. సాధారణంగా మనం పొరపాట్లు చేసినప్పుడు.. దాన్ని ఎత్తి చూపితే.. పెద్దగా పట్టించుకోం. కానీ మనం ఒక మంచి ప్లేయర్ అయ్యాక ఏమైనా తప్పులు ఎత్తి చూపితే వాటిని తట్టుకోలేం. అలాంటివాటికోసం ఆలోచిస్తూ... వాటి నుంచి తొందరగా బయటపడలేం’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రపంచకప్‌లో వరుస 5 హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్న కోహ్లి కీలక సెమీస్‌లో చేతులెత్తేయడం.. మిగతా బ్యాట్స్‌మెన్‌ కూడా రాణించకపోవడంతో భారత్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ప్రస్తుతం వెస్టిండీస్‌ పర్యటకు సిద్ధమైన భారత్‌.. ప్రపంచకప్‌ ఓటమి నుంచి కోలుకోని ఈ సిరీస్‌లో రాణించాలని భావిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top