అందుకే అతను ప్రత్యేకం

Virat Kohli 1st Indian to slam 3 successive ODI hundreds - Sakshi

సునీల్‌ గావస్కర్‌

వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టు భారత్‌ను ఆశ్చర్యపరిచింది. మూడో వన్డేలో గెలిచి సిరీస్‌ను రసవత్తరంగా మార్చింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వరుసగా మూడో సెంచరీతో అదరగొట్టినా... టీమిండియా లక్ష్యానికి చాలా దూరంలోనే నిలిచిపోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లి అగ్రస్థానంలో ఎందుకు ఉన్నా డో ఈ ఇన్నింగ్స్‌ చూస్తే అర్థమవుతుంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా... బెదురులేకుండా బ్యాటింగ్‌ చేయడమే అతన్ని ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి వేరు చేస్తోంది. భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. కావాల్సిన రన్‌రేట్‌ను దృష్టిలో పెట్టుకొని ఇన్నింగ్స్‌ను నడిపించాల్సి ఉంటుంది.

అవతలి ఎండ్‌లో వికెట్లు పడుతుంటే ఇది మరింత కష్టమవుతుంది. అలాంటి సమయంలో ఓ బ్యాట్స్‌మన్‌లోని అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. చాలా మంది బ్యాట్స్‌మెన్‌లను గమనిస్తే  మొదట బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వారు చాలా బాగా ఆడతారు. అదే లక్ష్య ఛేదనకు వచ్చేసరికి అంతా మారిపోతుంది. కానీ కోహ్లి తీరు వీరందరికి భి న్నం. ఛేదనలో అతని షాట్ల ఎంపిక చక్కగా ఉంటుంది. మూడో వన్డేలో  షై హోప్‌ చెలరేగడంతో మధ్య ఓవర్లలో విండీస్‌ పుంజుకుంది. అతనికి కెప్టెన్‌ హోల్డర్‌ చక్కటి సహకారం అందించాడు. ఇక చివర్లో నర్స్‌ చెలరేగిపోయి జట్టుకు మంచి స్కోరు సాధించిపెట్టాడు. ఈ పర్యటనలో విండీస్‌ కెప్టెన్‌ రోజు రోజుకూ మెరుగవుతున్నాడు. ఆటగాడిగానే కాక సారథిగానూ ఆకట్టుకుంటున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top