
న్యూఢిల్లీ: విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఆంధ్ర జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 73 పరుగుల తేడాతో ఆంధ్రపై గెలుపొందింది. గ్రూప్ ‘బి’లో మంగళవారం జరిగిన ఈ పోరులో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హిమ్మత్ సింగ్ (75 బంతుల్లో 102 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు సెంచరీ నమోదు చేశాడు. ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ (62), నితీశ్ రాణా (52) అర్ధ సెంచరీలు సాధించారు.
గంభీర్ 37 పరుగులు చేశాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి 2, షోయబ్ ఖాన్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. తర్వాత భారీ లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 49.5 ఓవర్లలో 241 పరుగుల వద్ద ఆలౌటైంది. ప్రశాంత్ (54), రికీ భుయ్ (48) రాణించారు. రవితేజ (35), కరణ్ శర్మ (25) కాస్త మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్లలో కెజ్రోలియా, పవన్ నేగి, నితీశ్ రాణా తలా 2 వికెట్లు పడగొట్టారు. ఆరు మ్యాచ్‌లాడిన ఆంధ్ర నాలుగింట గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఈ గ్రూప్‌లోనే జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కేరళపై గెలిచింది. 7 మ్యాచ్‌లాడిన హైదరాబాద్‌కు ఇది నాలుగో గెలుపు కాగా... రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.