కాచుకో ఇంగ్లండ్‌!

Tomorrow Womens T20 World Cup semifinal - Sakshi

వన్డే ప్రపంచ చాంపియన్‌తో  భారత్‌ అమీతుమీ

రేపు మహిళల టి20  ప్రపంచకప్‌ సెమీఫైనల్‌  

నార్త్‌ సాండ్‌ (అంటిగ్వా): వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకునేందుకు భారత మహిళల జట్టుకు సరైన అవకాశం. టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గతేడాది జూన్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ 9 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆ ఓటమి అనంతరం రాటుదేలిన టీమిండియా ఇంటాబయటా వరుస విజయాలు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యే సెమీస్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుచేసి తొలిసారి టి20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరాలని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం భావిస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో టీమిండియా అజేయంగా సెమీస్‌ చేరగా... ఇంగ్లండ్‌ మాత్రం కిందామీద పడుతూ ఇక్కడి వరకు వచ్చింది.  

ఆ ఇద్దరే బలంగా... 
టోర్నీ తొలి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో పటిష్ట న్యూజిలాండ్‌పై టీమిండియా గెలిచింది. ఆ తర్వాత బాదే బాధ్యతను వెటరన్‌ మిథాలీ రాజ్‌ తీసుకుంది. వరుస అర్ధసెంచరీలతో పాకిస్తాన్, ఐర్లాండ్‌ల పనిపట్టింది. చివరిలీగ్‌ మ్యాచ్‌లో స్మృతి మంధాన, హర్మన్‌ విజృంభించడంతో టోర్నీ ఫేవరెట్‌ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఇప్పటివరకు 167 పరుగులతో హర్మన్‌ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలవగా... స్మృతి 144 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. టాపార్డర్‌లో యువ జెమీమా రోడ్రిగ్స్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంది. వీరంతా ఇదే ప్రదర్శనను కొనసాగించాలని జట్టు ఆశిస్తోంది. ఇక మిడిలార్డర్‌లో దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తాన్యా భాటియా కూడా తలా ఓ చేయివేస్తే టీమిండియాకు తిరుగుండదు. నలుగురు స్పిన్నర్లతో భారత బౌలింగ్‌ విభాగం బలంగా కనిపిస్తోంది. స్పిన్‌ చతుష్టయం సత్తా చాటుతుండటంతో కోచ్‌ రమేశ్‌ పవార్‌ ఏకైక పేసర్‌ వ్యూహాన్నే అనుసరిస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ ప్రత్యర్థి భరతం పడుతుండగా... ఆమెకు రాధ, దీప్తి, హేమలత చక్కటి సహకారం అందిస్తున్నారు.   మరోవైపు ఈ టోర్నీలో ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఇంగ్లండ్‌ సెమీస్‌లోనైనా జోరు కనబర్చాలని చూస్తోంది. కెప్టెన్‌ హీథర్‌ నైట్, వ్యాట్, బ్యూమౌంట్, స్కీవర్, అమీ జోన్స్‌లతో ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. పేసర్లు స్కీవర్, ష్రబ్‌సోల్‌ మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. భారత్, ఇంగ్లండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కంటే ముందు గురువారం అర్ధరాత్రి గం.1.20 నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్‌తో ఆస్ట్రేలియా తలపడుతుంది.  

► ఇప్పటివరకు భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్లు 13 టి20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. మూడింటిలో భారత్‌ గెలుపొందగా... పది మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

► శుక్రవారం ఉదయం గం. 5.20 నుంచి   స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top