ద న్యూ జోగిందర్ శర్మ ఈజ్‌.. | The new Joginder Sharma: Twitter reacts to Hardik Pandya last over | Sakshi
Sakshi News home page

ద న్యూ జోగిందర్ శర్మ ఈజ్‌..

Mar 24 2016 3:54 PM | Updated on Sep 3 2017 8:29 PM

ద న్యూ జోగిందర్ శర్మ ఈజ్‌..

ద న్యూ జోగిందర్ శర్మ ఈజ్‌..

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని మరిపించే రీతిలో అత్యంత ఉత్కంఠభరితంగా ఉద్వేగ భరితంగా సాగిన బెంగళూరు టీ20 మ్యాచ్‌ గురించే ఇప్పుడు సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీని మరిపించే రీతిలో అత్యంత ఉత్కంఠభరితంగా ఉద్వేగ భరితంగా సాగిన బెంగళూరు టీ20 మ్యాచ్‌ గురించే ఇప్పుడు సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. ఆఖరి ఓవర్‌లో అనూహ్యమైన మలుపులతో సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను భారత్‌ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడించింది.

చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా.. ఎంఎస్‌ ధోనీ యువ బౌలర్‌ హర్థిక్‌ పాండ్యాకు బంతి ఇచ్చాడు. యువకుడు. పెద్దగా అనుభవం లేదు. అయినా నవ్వుతూ బంతిని చేతిలోకి తీసుకున్న పాండ్యా కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మిస్టర్ కూల్ కెప్టెన్‌ ధోనీ చెప్పిన సూచలను అక్షరాల పాటించి.. టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు.

తీవ్రస్థాయి ఉత్కంఠ, ఒత్తిడి నడుమ ఈ యంగ్‌స్టర్‌ ప్రశాంతంగా ఆడాడు. ఎక్కడా ఆందోళనకు గురికాలేదు. చివరి ఓవర్ లో అతడు వేసిన తొలి మూడు బంతులకు ఒక సింగిల్‌, రెండు ఫోర్లతో తొమ్మిది పరుగులు వచ్చాయి. ఇంకా రెండు పరుగులు చేస్తే బంగ్లా విజయం. అయినా మొక్కవోని ధైర్యంతో, కెప్టెన్‌ సూచనలతో పాండ్యా చివరి మూడు బంతుల్లో మ్యాజిక్ చేశాడు. ఒక్క పరుగు ఇవ్వకుండానే మూడు వికెట్లు పడ్డాయి. భారత్ గెలిచింది.

ఆ మ్యాజిక్‌ బౌలింగ్‌ చాలామందికి జోగిందర్ శర్మని గుర్తుకుతెచ్చింది. 2007 టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌.. భారత్ మొదట బ్యాటింగ్ చేసి 157 పరుగులు చేసింది. 19 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్‌ 9వికెట్లకు 145  పరుగులు చేసింది. చివరి ఓవర్లలో 13 పరుగులు చేయాలి. సరిగ్గా ఇప్పటిలాంటి పరిస్థితే. కెప్టెన్‌ ధోనీ కొత్త బౌలర్‌ జోగిందర్‌ శర్మపై నమ్మకముంచి బంతిని ఇచ్చాడు. మిస్బావుల్‌ హక్ అప్పటికే క్రీజులో దూకుడు మీద ఉన్నాడు. పాక్‌ విజయం ఖాయం అనుకుంటున్న తరుణం.

జోగిందర్ వేసిన మొదటి బాల్ వైడ్‌. రెండో బాల్‌ డాట్‌. మూడో బంతి జోగిందర్ ఫుల్‌టాస్ వేయడంతో మిస్బా సిక్స్‌ బాదాడు. దీంతో పాక్ విజయానికి 4 బంతుల్లో ఆరు పరుగులు కావాలి. జోగిందర్‌ నాలుగో బంతికి మ్యాజిక్‌ చేశాడు. అతను విసిరిన బంతిని షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో స్కూప్‌షాట్‌ ఆడబోయాడు మిస్బా.  పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీశాంత్ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. పాక్ ఆలౌట్‌. భారత్‌ అలా తొలి టీ20 వరల్డ్‌కప్‌ ను అందుకొని మధురమైన చరిత్రను లిఖించింది. అదే సీన్‌ మళ్లీ ఇప్పుడు రిపీట్‌ అయిందని నెటిజన్స్‌ ట్విట్టర్‌లో పాండ్యాను ప్రశంసిస్తున్నారు. ట్విట్టర్‌లో చివరి ఓవర్‌పై అనేక కామెంట్స్‌ వెల్లువెత్తుతున్నాయి. చివరి ఓవర్‌లో తడబాటుకు గురికాకుండా బౌలింగ్‌ చేసిన పాండ్యాను ఆత్మవిశ్వాసాన్ని నెటిజన్లు వేనోళ్ల కొనియాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement