బౌల్ట్‌ దెబ్బకు.. భారత్‌ ప్యాకప్‌ | Team india All Out For 92 In 4th One Day Against New Zealand | Sakshi
Sakshi News home page

బౌల్ట్‌ దెబ్బకు.. భారత్‌ ప్యాకప్‌

Jan 31 2019 9:53 AM | Updated on Jan 31 2019 10:15 AM

Team india All Out For 92 In 4th One Day Against New Zealand - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో సిరీస్‌ అంటే ఎలా ఉంటుందో నాలుగో వన్డేకు గాని టీమిండియాకు తెలిసిరాలేదు. తొలి మూడు వన్డేలు ఆడుతుపాడుతూ గెలిచిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో మాత్రం ఘోరంగా తడబడింది. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(5/21), గ్రాండ్‌ హోమ్‌(3/26) పదునైన బౌలింగ్‌కు భారత బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడారు. కివీస్‌ బౌలర్ల ధాటికి కనీస గౌరవప్రదమైన స్కోర్‌ నమోదు చేయకుండానే 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే ప్యాకప్‌ అయింది. పాండ్యా(16) చహల్‌(18), కుల్దీప్‌(15)లు చివర్లో రాణించడంతో ఆమాత్రం స్కోరయినా టీమిండియా సాధించగలిగింది.    దీంతో తొమ్మిదేళ్ల అనంతరం అత్యల్ప స్కోర్‌కు ఆలౌటై చెత్త రికార్డును నెలకొల్పింది. అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌(88) పైనే ఈ రికార్డు ఉంది. శ్రీలంక(2000)పై 54 పరుగులే భారత్‌కు వన్డేల్లో అత్యల్ప స్కోరు కావడం గమనార్హం.
 
ఓ దశలో క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌కే టీమిండియా ఆలౌటవుతుందా అనే అనుమానాన్ని బ్యాట్స్‌మెన్‌ కలిగించారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియాకు తొలి 5 ఓవర్లు మాత్రమే ఆనందాన్ని కలిగించాయి. అనంతరం రోహిత్‌ సేనకు కివీస్‌ బౌలర్లు అసలు పేస్‌ రుచి చూపించారు.   టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించలేకపోయారు. కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ధావన్‌ (13) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగగా.. రోహిత్‌ శర్మ(6) రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. దీంతో 23 పరుగులకే టీమిండియా ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం రాయుడు(0), కార్తీక్‌(0)లు గ్రాండ్‌ హోమ్‌ బౌలింగ్‌లో వెంటవెంటనే ఔటయ్యారు. ఎన్నో అంచనాల మధ్య అరంగేట్రం చేసిన శుబ్‌మన్‌ గిల్‌(9) కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కష్టకాలంలో బాధ్యతాయుతంగా ఆడతాడని భావించిన జాదవ్‌(1) కూడా బౌల్ట్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. గ్రాండ్‌ హోమ్‌ మూడు వికెట్లు సాధించగా.. ఆస్టల్‌, నీషమ్‌లు తలో వికెట్‌ పడగొ​ట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement