మళ్లీ గెలుపు బాట పట్టేదెవరు? 

sunil gavaskar match analysis - Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ చేతుల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎలా కోలుకుంటుందనేది ఆసక్తికరం. శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుత బ్యాటింగ్‌ దినేశ్‌ కార్తీక్‌ జట్టును విజయం నుంచి దూరం చేసింది. ఛేదనకు అవసరమైన రీతిలో ఆ జట్టుకు ఆరంభమే లభించలేదు. ఈ మ్యాచ్‌లో ముగ్గురు టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ షార్ట్‌ బాల్‌కు ఔట్‌ కావడాన్ని బట్టి చూస్తే రాయల్‌ చాలెంజర్స్‌ కూడా అదే వ్యూహాన్ని అనుసరించవచ్చు. సునీల్‌ నరైన్‌ అప్పటి వరకు అన్ని వైపుల షాట్లు కొట్టినా నేరుగా శరీరంపైకి వచ్చిన బంతిని ఆడలేకపోయాడు. షార్ట్‌ బంతిని మెరుగ్గా ఆడటంలో ఉతప్పకు మంచి నైపుణ్యం ఉంది. అతను బెంగళూరులో సొంత ప్రేక్షకుల సమక్షంలో రాణించాలని కోరుకుంటున్నాడు. మైదానంలో ఏ మూలకైనా సిక్సర్‌ కొట్టి ప్రత్యర్థిని భయపెట్టగల రసెల్‌ కూడా జట్టులో ఉన్నాడు. 

ఈ సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ పయనం పడుతూ లేస్తూ సాగుతోంది. నిజానికి వారి భారీ బ్యాటింగ్‌ లైనప్‌ను చూస్తే ఎలాంటి పెద్ద లక్ష్యమైనా వారి ముందు చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ నిలకడలేమితో పాటు టాపార్డర్‌లో మంచి ఆరంభాలు లభించకపోవడమే వారికి సమస్యగా మారింది. కలలో కూడా ఊహించలేని తరహా షాట్లు ఆడుతూ డివిలియర్స్‌ ప్రత్యర్థి ఆటగాళ్లు ఊపిరి ఆగిపోయేలా చేస్తున్నాడు. అయితే డెత్‌ బౌలింగ్‌ వారిని బాగా ఇబ్బంది పెడుతోంది. ధోని దూకుడు మీద ఉన్న సమయంలో చివరి ఓవర్లలో అండర్సన్‌ బౌలింగ్‌ చేయడం సరైన వ్యూహం అనిపించుకోదు. ఇటీవలే మళ్లీ బౌలింగ్‌ చేయడం మొదలు పెట్టిన అండర్సన్‌లో స్లాగ్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసే ఆత్మవిశ్వాసం లోపించడం సహజం. ఫలితంగానే సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఆ జట్టు చేజార్చుకుంది.   గత మ్యాచ్‌లలో భారీ ఓటముల తర్వాత ఇరు జట్లు కూడా మళ్లీ మ్యాచ్‌ గెలిచి గాడిలో పడాలని భావిస్తున్నాయి. ఇరు జట్లలో కూడా చెప్పుకోదగ్గ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు కాబట్టి మరో హోరాహోరీ పోరు ఖాయం.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top