డిసెంబరులో దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన | South Africa tour of India in December | Sakshi
Sakshi News home page

డిసెంబరులో దక్షిణాఫ్రికాలో భారత్ పర్యటన

Oct 23 2013 12:44 AM | Updated on Sep 1 2017 11:52 PM

భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన అధికారికంగా ఖరారైంది. డిసెంబర్‌లో జరిగే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు జరుగుతాయి.

న్యూఢిల్లీ: భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన అధికారికంగా ఖరారైంది. డిసెంబర్‌లో జరిగే ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో రెండు టెస్టులు, మూడు వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌ను ఓ కొలిక్కి తెచ్చేందుకు బీసీసీఐ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్, దక్షిణాఫ్రికా క్రికెట్ (సీఎస్‌ఏ) అధ్యక్షుడు క్రిస్ నెన్‌జాన్‌ల మధ్య లండన్‌లో చర్చలు జరిగాయి. ‘దక్షిణాఫ్రికా జట్టు తమ సొంత గడ్డపై భారత్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది.
 
 
 ఎక్కడ, ఎప్పుడు ఈ మ్యాచ్‌లు జరిగేది త్వరలోనే వెల్లడిస్తాం’ అని ఇరు జట్ల బోర్డులు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. దీంతో గత జూలై నుంచి ఈ పర్యటనపై కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగినట్టయ్యింది. సీఎస్‌ఏ సీఈవోగా హరూన్ లోర్గాట్ నియామకమైనప్పటి నుంచి ఈ టూర్‌పై బీసీసీఐ పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతోపాటు తమకు తెలియకుండానే టోర్నీ సుదీర్ఘ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో భారత బోర్డుకు మరింత ఆగ్రహం పెరిగింది.
 
 
 భారత సిరీస్‌తో తమ ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి ఉండడంతో సీఎస్‌ఏ దిద్దుబాటు చర్యలకు దిగి లోర్గాట్‌ను బీసీసీఐతో జరిగే వ్యవహారాలకు దూరంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. అలాగే బీసీసీఐని విమర్శిస్తూ బెకర్ రాసిన లేఖలో లోర్గాట్ పాత్రపై ఐసీసీ విచారణ చేపట్టనుండడంతో అప్పటిదాకా ఐసీసీతోనూ ఎలాంటి కార్యకలాపాలు నెరపకూడదని సీఎస్‌ఏ స్పష్టం చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement