
న్యూఢిల్లీ : టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌ను పురుషల క్రికెట్ జట్టు కోచ్‌గా చూడాలని ఉందని బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఓ టెలివిజన్ షోలో ఈ ఇద్దరు సరదాగా ముచ్చటించారు. మ్యాచ్ మధ్యలో పుస్తకాల చదవడంపై మిథాలీ స్పందిస్తూ.. ఒత్తిడిని అధిగమించడానికే పుస్తకాలు చదువుతానని పేర్కొన్నారు. దీంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మంచి ప్రదర్శన కనబర్చడానికి ఉత్తేజాన్నిస్తోందని తెలిపారు. ఇక మిథాలీపై కింగ్ ఖాన్ ప్రశంసల జల్లు కురపించారు.
ఇదే తరుణంలో .‘మిథాలీ నిన్ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా చూడాలని ఉందని’ షారుక్ ఖాన్ తన మనసులోని కోరికను బయటపెట్టారు. దీనికి వెంటనే మిథాలీ స్పందిస్తూ.. ‘నేనేప్పుడు నా గొప్ప ప్రదర్శనే ఇవ్వాలనే కోరుకుంటా’ అని తెలిపింది. మిథాలీ నాయకత్వంలో భారత మహిళల క్రికెట్ జట్టు ఆదరణ పొందిందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నాయకత్వంలోనే రెండు సార్లు భారత్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. గేతేడాది జరిగిన ప్రపంచకప్‌లో ఫైనల్లో ఓడినా అద్భుత ప్రదర్శనతో క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకున్న విషయం తెలిసిందే.