సూపర్‌గా ఆడి... సెమీస్‌కు చేరి... | Satwik Sairaj And Chirag Shetty Enter To Semi Final | Sakshi
Sakshi News home page

సూపర్‌గా ఆడి... సెమీస్‌కు చేరి...

Oct 26 2019 5:14 AM | Updated on Oct 26 2019 5:32 AM

Satwik Sairaj And Chirag Shetty Enter To Semi Final - Sakshi

పారిస్‌: అంతర్జాతీయ వేదికపై పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి మరోసారి సత్తా చాటుకుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నమెంట్‌లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జంట 21–13, 22–20తో ప్రపంచ ఎనిమిదో ర్యాంక్‌ జోడీ కిమ్‌ యాస్‌ట్రప్‌–ఆండెర్స్‌ రస్‌ముసేన్‌ (డెన్మార్క్‌)ను బోల్తా కొట్టించింది.

గురువారం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్స్, రెండో సీడ్‌ మొహమ్మద్‌ హసన్‌–హెండ్రా సెతియవాన్‌ (ఇండోనేసియా)లపై నెగ్గి సంచలనం సృష్టించిన సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ అదే జోరులో మరో గొప్ప విజయం నమోదు చేసి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీస్‌కు చేరారు. గతంలో కిమ్‌–ఆండెర్స్‌లతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన సాతి్వక్‌–చిరాగ్‌ మూడో ప్రయత్నంలో మాత్రం గెలుపు రుచి చూశారు. తొలి గేమ్‌లో చెలరేగి ఆడిన భారత జంట ఆరంభంలోనే 5–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకుంటూ గేమ్‌ను దక్కించుకుంది.

రెండో గేమ్‌లో డెన్మార్క్‌ జోడీ పుంజుకుంది. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 4–0తో ముందంజ వేసింది. అయితే వెంటనే తేరుకున్న భారత జంట 9–9 వద్ద స్కోరును సమం చేసింది. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి 16–12తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ పట్టువదలని డెన్మార్క్‌ జంట పాయింట్లు సాధించి 20–19తో గేమ్‌ను గెలిచే దిశగా నిలిచింది. కానీ కీలకదశలో తప్పిదాలు చేయకుండా ఆడిన సాతి్వక్‌–చిరాగ్‌ వరుసగా మూడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది.  

ఈసారి సైనాను...
మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. పీవీ సింధు, సైనా క్వార్టర్‌ ఫైనల్లో ని్రష్కమించారు. డెన్మార్క్‌ ఓపెన్‌లో సింధును ఓడించిన 17 ఏళ్ల కొరియా అమ్మాయి యాన్‌ సె యంగ్‌ ఈసారి సైనాకు షాక్‌ ఇచ్చింది. 49 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో యాన్‌ సె యంగ్‌ 22–20, 23–21తో సైనాను ఓడించి సెమీస్‌కు చేరింది. ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో 75 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ఆరోర్యాంకర్‌ సింధు 16–21, 26–24, 17–21తో ఓడిపోయింది. ప్రపంచ చాంపియన్‌ అయ్యాక తాను పాల్గొన్న నాలుగో టోర్నమెంట్‌లోనూ సింధు క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోవడం గమనార్హం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement