
ముంబై: ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, బ్రియన్ లారా ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. వారి పేరున ఉన్న రికార్డులే వారి గురించి చెబుతాయి. 1990 నాటి తరంలో ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు ఎవరు అంటే వారిద్దరి పేర్లు వినిపిస్తాయి. ఒకరితో ఒకరు అనే విధంగా పోటీపడ్డారు. తమ బ్యాట్‌లకు పని చెప్పి పరుగుల వరద పారించారు.
అయితే సచిన్‌కు లారా ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడట. ఎవరూ ఊహించని విధంగా సచిన్ కు కూడా చెప్పాపెట్టకుండా సచిన్ ఇంటికి వెళ్లాడట లారా. ఈ విషయాన్ని సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలుపుతూ లారాతో కలిసి దిగిన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. భారత్ తరఫున 200 టెస్టులు ఆడిన సచిన్ 53 సగటుతో 15,921 పరుగులు సాధించారు. లారా 11,953 పరుగులతో నిలిచారు. ఇక వన్డేల్లో మాస్టర్ పరుగులు 18,426 కాగా లారా 299 వన్డేల్లో 10,405 పరుగులు చేశారు. క్రికెట్ ఘనతల పుస్తకంలో సచిన్ పేరుతో ఎన్నో ఘనతలు ఉండగా టెస్టుల్లో 400 పరుగులు చేసిన ఘనత మాత్రం లారాదే. ప్రస్తుతం టీమిండియా-వెస్టిండీస్ సిరీస్ నేపథ్యంలో భారత్‌లోనే ఉన్నాడు లారా.