రఫ్ఫాడించిన రష్యా

Russia Frolicks Past Egypt at the World Cup - Sakshi

ఈజిప్ట్‌పై 3–1తో ఘన విజయం

నాకౌట్‌ దశకు అర్హత

 1986 తర్వాత తొలిసారి ఈ ఘనత

ఆతిథ్య దేశం హోదాలో రష్యా జట్టు మరోసారి అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. వరుసగా రెండో విజయం సాధించి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో నాకౌట్‌ దశకు అర్హత పొందిన తొలి జట్టుగా గుర్తింపు సాధించింది. 32 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 1986 తర్వాత రష్యా ఈ మెగా ఈవెంట్‌లో నాకౌట్‌ బెర్త్‌ దక్కించుకుంది.

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: తొలి మ్యాచ్‌లో తాము సాధించిన భారీ విజయం గాలివాటమేమీ కాదని రష్యా ఫుట్‌బాల్‌ జట్టు నిరూపించింది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో రష్యా 3–1తో ఈజిప్ట్‌ను చిత్తుగా ఓడించి ఈ టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. 6 పాయింట్లతో నాకౌట్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈజిప్ట్‌ కెప్టెన్‌ అహ్మద్‌ ఫతీ 47వ నిమిషంలో ‘సెల్ఫ్‌ గోల్‌’ చేయడంతో రష్యా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 59వ నిమిషంలో చెరిషెవ్, 62వ నిమిషంలో డిజుబా ఒక్కో గోల్‌ చేయడంతో రష్యా 3–0తో ముందంజ వేసింది. 73వ నిమిషంలో ఈజిప్ట్‌కు సలా ఏకైక గోల్‌ అందించాడు. 

పోటాపోటీ... 
ప్రపంచకప్‌లో బరిలోకి దిగే ముందు తాము ఆడిన చివరి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించకపోవడంతో రష్యా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై 5–0తో నెగ్గిన రష్యా... అదే జోరును రెండో మ్యాచ్‌లోనూ కనబరిచింది. ఉరుగ్వేతో జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన ఈజిప్ట్‌ స్టార్‌ ప్లేయర్‌ సలా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగినా అంతగా ప్రభావం చూపలేకపోయాడు. తమకు లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి అభిమానులకు ఊరట కలిగించాడు. తొలి మ్యాచ్‌ మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ రష్యా ఆటగాళ్లు దూకుడు ప్రదర్శిం చారు. అవకాశం దొరికినపుడల్లా ఈజిప్ట్‌ గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించారు. అయితే ఫినిషింగ్‌ సరిగ్గా లేకపోవడం, ఈజిప్ట్‌ రక్షణ శ్రేణి కూడా అప్రమత్తంగా ఉండటంతో గోల్‌ నమోదు కాలేదు. 

ఏకపక్షం... 
రెండో అర్ధభాగంలోనూ రష్యా దూకుడు తగ్గించలేదు. ఫలితంగా ఆట మొదలైన రెండు నిమిషాలకు వారి ఖాతాలో గోల్‌ చేరింది. రొమాన్‌ జోబ్‌నిన్‌ కొట్టిన షాట్‌ గురి తప్పింది. దీంతో గోల్‌పోస్ట్‌ ముందున్న మరో రష్యా ప్లేయర్‌ డిజుబాకు బంతి అందకూడదనే ఉద్దేశంతో ఈజిప్ట్‌ ఆటగాడు ఫతీ ప్రయత్నించగా బంతి అతని కాలికి తగిలి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లి సెల్ఫ్‌గోల్‌ అయింది. ఆ తర్వాత మూడు నిమిషాల వ్యవధిలో రష్యా రెండు గోల్స్‌ సాధించింది. 59వ నిమిషంలో సమెదోవ్‌ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న మారియో ఫెర్నాండెజ్‌ క్రాస్‌ షాట్‌ కొట్టాడు. అతని షాట్‌ను గోల్‌ పోస్ట్‌ ముందున్న చెరిషెవ్‌ లక్ష్యంవైపు పంపించడంతో రష్యా ఖాతాలో రెండో గోల్‌ చేరింది. మూడు నిమిషాల తర్వాత కుటెపోవ్‌ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియా పైభాగంలో అందుకున్న డిజుబా బంతిని నియంత్రించి బలమైన షాట్‌తో ఈజిప్ట్‌ గోల్‌కీపర్‌ ను బోల్తా కొట్టించాడు. 73వ నిమిషంలో ఈజిప్ట్‌ ప్లేయర్‌ సలాను ‘డి’ ఏరియాలో రష్యా ఆటగాడు మొరటుగా అడ్డుకోవడంతో వీడియో అసిస్టెంట్‌ రిఫరీ సహాయంతో వారికి పెనాల్టీ కిక్‌ లభించింది. దీనిని సలా ఎలాంటి పొరపాటు చేయకుండా లక్ష్యానికి చేర్చాడు. చివర్లో ఈజిప్ట్‌ కాస్త పోరాడినా రష్యా రక్షణ పంక్తిని ఛేదించలేకపోయింది.

ఆతిథ్య దేశం హోదాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే అత్యధికంగా 8 గోల్స్‌ చేసి 1934లో ఇటలీ పేరిట ఉన్న రికార్డును రష్యా సమం చేసింది. ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో నమోదైన సెల్ఫ్‌ గోల్స్‌ సంఖ్య. 1998 ప్రపంచకప్‌లో అత్యధికంగా ఆరు సెల్ఫ్‌ గోల్స్‌ వచ్చాయి.  ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌ తరఫున గోల్‌ చేసిన మూడో ప్లేయర్‌గా సలా నిలిచాడు. గతంలో అబ్దుల్‌ రెహమాన్‌ ఫావ్జి (1934లో రెండు), మగ్దీ అబిద్‌ అల్‌ ఘనీ ((1990లో ఒకటి) ఈ ఘనత సాధించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top