కెర్బర్, వీనస్‌ ఇంటిముఖం | Roger Federer into second round with straight set win | Sakshi
Sakshi News home page

కెర్బర్, వీనస్‌ ఇంటిముఖం

May 27 2019 4:11 AM | Updated on May 27 2019 4:11 AM

 Roger Federer into second round with straight set win - Sakshi

పారిస్‌: టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. తొలి రోజు మహిళల సింగిల్స్‌ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ క్రీడాకారిణులు ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ), వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 81వ ర్యాంకర్‌ అనస్తాసియా పొటపోవా (రష్యా) 6–4, 6–2తో ఐదో సీడ్‌ కెర్బర్‌ను బోల్తా కొట్టించగా... తొమ్మిదో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–3, 6–3తో 2002 రన్నరప్‌ వీనస్‌ను ఓడించింది. పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్‌ కచ్చితమైన సర్వీస్‌ చేయలేకపోయింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన కెర్బర్‌ 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది.

స్వితోలినాతో 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్‌ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పోటీనివ్వలేదు. మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసిన 38 ఏళ్ల వీనస్‌ ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్‌ 2006 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో రెండో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 6–3తో మాడిసన్‌ బ్రింగిల్‌ (అమెరికా)పై, మాజీ చాంపియన్, 19వ సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 5–7, 6–2, 6–2తో టేలర్‌ టౌన్‌సెండ్‌ (అమెరికా)పై, 15వ సీడ్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) 6–1, 6–4తో జెస్సికా పొంచెట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

ఫెడరర్‌... వరుసగా 60వ సారి
పురుషుల సింగిల్స్‌ విభాగంలో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ శుభారంభం చేశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతున్న మూడో సీడ్‌ ఫెడరర్‌ 6–2, 6–4, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్‌లో వరుసగా 60వ విజయం కావడం విశేషం. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ ఐదు ఏస్‌లు సంధించాడు. 30సార్లు నెట్‌ వద్దకు వచ్చి 25సార్లు పాయింట్లు సాధించాడు. ఫెడరర్‌తోపాటు ఆరో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌), 11వ సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. సిట్సిపాస్‌ 6–2, 6–2, 7–6 (7/4)తో మార్టెరర్‌ (జర్మనీ)పై, నిషికోరి 6–2, 6–3, 6–4తో క్వెంటన్‌ హాలిస్‌ (ఫ్రాన్స్‌)పై, సిలిచ్‌ 6–3, 7–5, 6–1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు.

ప్రజ్నేశ్‌కు నిరాశ...
భారత నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లోనూ తొలి రౌండ్‌ దాటలేకపోయాడు. తన ర్యాంకింగ్‌ ఆధారంగా నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్‌ 1–6, 3–6, 1–6తో హుగో డెలియన్‌ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్‌ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి రౌండ్‌లో ఓడిన ప్రజ్నేశ్‌కు 46 వేల యూరోలు (రూ. 35 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ ప్రజ్నేశ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement