రిషికేత్‌ మరో డబుల్‌ సెంచరీ

Rishiketh Gets Double Century Again - Sakshi

జాహ్నవి డిగ్రీ కాలేజి ఘనవిజయం

అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్‌ కాలేజి, స్కూల్స్‌ నాకౌట్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో జాహ్నవి డిగ్రీ కాలేజి బ్యాట్స్‌మన్‌ రిషికేత్‌ సిసోడియా (135 బంతుల్లో 200; 8 ఫోర్లు, 18 సిక్సర్లు) మరోసారి దుమ్మురేపాడు. మంచినీళ్ల ప్రాయంలా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇటీవలే పేజ్‌ జూనియర్‌ కాలేజీతో జరిగిన మ్యాచ్‌లో అజేయ 291 పరుగులతో విజృంభించిన రిషికేత్‌ ఐదు రోజుల వ్యవధిలోనే మరో డబుల్‌ సెంచరీతో తన సత్తా చాటాడు. దీంతో భవన్స్‌ వివేకానంద సైన్స్‌ కాలేజీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జాహ్నవి జట్టు 189 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జాహ్నవి జట్టు రిషికేత్‌ మెరుపు డబుల్‌ సెంచరీతో 42 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగుల భారీస్కోరు సాధించింది. అనంతరం భవన్స్‌ జట్టు 28.3 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. పి. నితీశ్‌ రెడ్డి (51) అర్ధసెంచరీతో పోరాడాడు.  

హర్షవర్ధన్‌ సింగ్‌ సెంచరీ  

బ్యాటింగ్‌లో హర్షవర్ధన్‌ సింగ్‌ (83 బంతుల్లో 102; 11 ఫోర్లు), బౌలింగ్‌లో అనికేత్‌ రెడ్డి (4/19) చెలరేగడంతో జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ (నాచారం)తో జరిగిన మ్యాచ్‌లో నిజామాబాద్‌ జిల్లా 127 పరుగులతో గెలుపొందింది. హర్షవర్ధన్‌ సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన నిజామాబాద్‌ జిల్లా 32 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. అజిత్‌ (30) రాణించాడు. అనంతరం అనికేత్‌ ధాటికి జాన్స న్‌ గ్రామర్‌ స్కూల్‌ 82 పరుగులకే ఆలౌటైంది.  
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు: ∙నల్లగొండ జిల్లా: 149, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (రామంతాపూర్‌): 39 (రాజీవ్‌ 4/11, ముజాహిద్‌ 4/9).

ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (నాచారం): 135 (సాయి కౌశిక్‌ 60; నారాయణ్‌ తేజ 3/44), ఖమ్మం జిల్లా: 142/5 (సునీల్‌ అరవింద్‌ 31, విశాల్‌ 40, రాకేశ్‌ 35).
హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ (బేగంపేట్‌): 203/9 (పృథ్వీ రెడ్డి 37; ఆదిత్య 34; హర్ష సంక్‌పాల్‌ 3/34, క్రితిక్‌ రెడ్డి 3/37), గౌతమ్‌ జూనియర్‌ కాలేజి: 138 (క్రితిక్‌ రెడ్డి 57; ఇబ్రహీం ఖాన్‌ 4/38, పృథ్వీ రెడ్డి 6/22).

ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌: 102 (కుశాల్‌ అగర్వాల్‌ 35; ఫర్దీన్‌ ఫిరోజ్‌ 3/27), భవన్స్‌ అరబిందో కాలేజి: 105/1 (ఇషాన్‌ శర్మ 43, నిశాంత్‌ 39 నాటౌట్‌).
వరంగల్‌ జిల్లా: 155 (సుకృత్‌ 60; జైదేవ్‌ గౌడ్‌ 3/40), సర్దార్‌ పటేల్‌: 156/4 (జైదేవ్‌ గౌడ్‌ 32, అబ్దుల్‌ అద్నాన్‌ 47 నాటౌట్‌).
మహబూబ్‌నగర్‌ జిల్లా: 284/5 (హర్ష 117, అరుణ్‌ 48 నాటౌట్‌), లయోలా డిగ్రీ కాలేజి: 90 (జుబేర్‌ 3/12, అరుణ్‌ 3/15).

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top