జమైకా చిరుత.. పరుగు ఆపేస్తోంది! | Rio will be my last Olympics, says Usain Bolt | Sakshi
Sakshi News home page

జమైకా చిరుత.. పరుగు ఆపేస్తోంది!

Mar 22 2016 8:56 AM | Updated on Sep 3 2017 8:20 PM

జమైకా చిరుత.. పరుగు ఆపేస్తోంది!

జమైకా చిరుత.. పరుగు ఆపేస్తోంది!

నల్లచిరుత ఉసేన్ బోల్ట్.. ఇక పరుగులు ఆపేస్తున్నాడు. ఈ ఏడాది రియో డి జెనిరోలో జరగనున్న ఒలింపిక్స్‌ తర్వాత రిటైరవుతానని నిర్ధారించాడు.

అతడు పరుగెడుతుంటే చిరుత కూడా ఒక్క నిమిషం అలా ఆగి చూస్తుంది. నాకన్నా ఇంతటి వేగం ఇతడికి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోతుంది. అలాంటి నల్లచిరుత ఉసేన్ బోల్ట్.. ఇక పరుగులు ఆపేస్తున్నాడు. ఈ ఏడాది రియో డి జెనిరోలో జరగనున్న ఒలింపిక్స్‌ తర్వాత రిటైరవుతానని నిర్ధారించాడు. ఆరుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన బోల్ట్ 2020 వరకు కూడా ఆడే అవకాశం ఉందని జనవరిలో చెప్పినా.. ఇప్పుడు మాత్రం ఇవే తన చిట్టచివరి ఒలింపిక్స్ అని స్పష్టం చేశాడు. మరో నాలుగేళ్లు ఇదే స్థాయిలో పరుగులు తీయడం చాలా కష్టమని, అందువల్ల రియోలో తాను అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఇక రిటైర్ అవుతానని చెప్పాడు.

లండన్‌లో 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే రేసుల్లో బోల్ట్ స్వర్ణపతకాలు సాధించాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో జరిగిన క్రీడల్లోనూ ఈ విభాగాలన్నింటిలో అతడే విజేత. తుపాకి నుంచి బుల్లెట్ బయటకు రావడం అయినా ఆలస్యం అవుతుందేమో గానీ, ఉసేన్ బోల్ట్ ఇలా పరుగు ప్రారంభించడం, అలా గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావని క్రీడా పండితులు చెబుతుంటారు.

మరోసారి ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు గెలవాలన్నది తన కల అని, దానిపైనే దృష్టిపెడుతున్నానని బోల్ట్ చెప్పాడు. 200 మీటర్ల పరుగులో 19.19 సెకన్లతో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరుమీదే ఉన్నా.. అతడికి మాత్రం సంతృప్తి లేదు. కనీసం 19 సెకన్ల లోపు ఆ రేసు పూర్తి చేయాలని తాను కలగంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి పరుగుల చిరుతను ఇక ట్రాక్ మీద చూడకపోవడం అంటే క్రీడాభిమానులకు నిరాశే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement