breaking news
bolt retirement
-
జమైకా చిరుత.. పరుగు ఆపేస్తోంది!
అతడు పరుగెడుతుంటే చిరుత కూడా ఒక్క నిమిషం అలా ఆగి చూస్తుంది. నాకన్నా ఇంతటి వేగం ఇతడికి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోతుంది. అలాంటి నల్లచిరుత ఉసేన్ బోల్ట్.. ఇక పరుగులు ఆపేస్తున్నాడు. ఈ ఏడాది రియో డి జెనిరోలో జరగనున్న ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతానని నిర్ధారించాడు. ఆరుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన బోల్ట్ 2020 వరకు కూడా ఆడే అవకాశం ఉందని జనవరిలో చెప్పినా.. ఇప్పుడు మాత్రం ఇవే తన చిట్టచివరి ఒలింపిక్స్ అని స్పష్టం చేశాడు. మరో నాలుగేళ్లు ఇదే స్థాయిలో పరుగులు తీయడం చాలా కష్టమని, అందువల్ల రియోలో తాను అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఇక రిటైర్ అవుతానని చెప్పాడు. లండన్‌లో 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే రేసుల్లో బోల్ట్ స్వర్ణపతకాలు సాధించాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో జరిగిన క్రీడల్లోనూ ఈ విభాగాలన్నింటిలో అతడే విజేత. తుపాకి నుంచి బుల్లెట్ బయటకు రావడం అయినా ఆలస్యం అవుతుందేమో గానీ, ఉసేన్ బోల్ట్ ఇలా పరుగు ప్రారంభించడం, అలా గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావని క్రీడా పండితులు చెబుతుంటారు. మరోసారి ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు గెలవాలన్నది తన కల అని, దానిపైనే దృష్టిపెడుతున్నానని బోల్ట్ చెప్పాడు. 200 మీటర్ల పరుగులో 19.19 సెకన్లతో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరుమీదే ఉన్నా.. అతడికి మాత్రం సంతృప్తి లేదు. కనీసం 19 సెకన్ల లోపు ఆ రేసు పూర్తి చేయాలని తాను కలగంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి పరుగుల చిరుతను ఇక ట్రాక్ మీద చూడకపోవడం అంటే క్రీడాభిమానులకు నిరాశే. -
రియోలో రిటైరవుతానంటున్న చిరుత
వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ తర్వాత తన కెరీర్ ముగిసే అవకాశం ఉందని స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. 2017లో లండన్‌లో జరగనున్న ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనే అవకాశం 50-50 మాత్రమే అని ఈ జమైకా దిగ్గజం చెప్పాడు. బహుశా రియో డీజెనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో రిటైరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. ''నా స్పాన్సర్లు మరో ఏడాది పాటు కొనసాగాలని కోరుతున్నారు. కానీ నాకోచ్ మాత్రం వచ్చే ప్రపంచ ఛాంపియన్ షిప్ కష్టమే అంటున్నాడు.. అందువల్ల రియో ఒలింపిక్స్ తర్వాత నా శరీరం పూర్తిగా సహకరిస్తేనే లండన్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో పాల్గొనే అవకాశం ఉంది'' అంటూ బోల్ట్ వ్యాఖ్యానించాడు. అయితే ప్రస్తుతం తన దృష్టి అంతా రియో ఒలింపిక్స్ మీదే ఉందన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ స్పందించాడు. అంతకు ముందు, బీజింగ్‌లో ప్రపంచ స్ప్రింట్ డబుల్ గెలిచిన తర్వాత.. విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బోల్ట్‌ను ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఢీకొట్టింది. ఒక టీవీ కెమెరామెన్ స్కూటర్ తగిలి పడిపోయిన బోల్ట్ నవ్వుతూ.. 'నా కాళ్లకు ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది' అంటూ వ్యాఖ్యానిచాడు. ఇక బోల్ట్‌ను స్కూటర్ ఢీకొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫుటేజ్‌పై టీవీ కెమెరా మ్యాన్ మాత్రమే బోల్ట్‌ను పడగొట్టగలడని చైనీస్ నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.