ఒకే ఒక్కడు... కిప్‌చెగో

Kipchoge Becomes First Runner To Finish Marathon Under 2 Hours - Sakshi

మారథాన్‌ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా గుర్తింపు  

వియన్నా: గతంలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను కెన్యా రన్నర్, రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ ఇలియుడ్‌ కిప్‌చెగో సాధించాడు. 42.195 కిలోమీటర్ల పురుషుల మారథాన్‌ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కిప్‌చెగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ప్రత్యేకంగా జరిగిన మారథాన్‌ రేసులో 34 ఏళ్ల కిప్‌చెగో గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్‌ రేసు కాకపోవడంతో కిప్‌చెగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు.

ప్రస్తుత మారథాన్‌ ప్రపంచ రికార్డు కిప్‌చెగో పేరిటే ఉంది. గత ఏడాది బెర్లిన్‌ మారథాన్‌లో కిప్‌చెగో 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శనివారం వియన్నాలో జరిగిన మారథాన్‌ రేసును తిలకించేందుకు కిప్‌చెగో స్వదేశం కెన్యాలోని వీధుల్లో ప్రత్యేకంగా టీవీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వేలాది మంది అభిమానులు కిప్‌చెగో ఘనతను టీవీల్లో వీక్షించారు. రెండేళ్ల క్రితం ఇటలీలో కిప్‌చెగో 2 గంటల్లోపు మారథాన్‌ రేసును పూర్తి చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే రెండో ప్రయత్నంలో మాత్రం అతను సఫలమై తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top