రవిశాస్త్రిని మరింత వాడుకోవాలి: గంగూలీ

Ravi Shastri Has To Be More Involved In NCA Ganguly - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తన కార్యాచరణను మరింత వేగవంతం చేశారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ కొనసాగేది ఏడాదిలోపే కావడంతో తన మార్కు ఉండాలనే భావనలో గంగూలీ పని చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) డైరక్టర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కలిసి అక్కడి పని తీరుపై ఆరాతీసిన గంగూలీ.. ఎన్‌సీఏను ఒక అద్భుత కేంద్రంగా తీర్చిదిద్దాలనే యోచనలో ఉన్నాడు. ద్రవిడ్‌తో భేటీ గురించి మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ద్రవిడ్‌ పర్యవేక్షణలో ఎన్‌సీఏను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేయబోతున్నట్లు వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్‌లో ఉన్న హై ఫెర్ఫామెన్స్‌ సెంటర్‌ తరహా కేంద్రాన్ని రూపొందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపాడు. 

‘ ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రిని మరో రకంగా కూడా వాడుకోవాలనుకుంటున్నాం. రవిశాస్త్రి ఎప్పటివరకూ కోచ్‌గా కొనసాగుతాడో అప్పటివరకూ అతని సేవల్ని ఎన్‌సీఏలో కూడా మిళితం చేస్తాం. ద్రవిడ్‌తో పాటు రవిశాస్త్రి, పారాస్‌ మాంబ్రే( అండర్‌-19, భారత్‌-ఏ కోచ్‌), భరత్‌ అరుణ్‌(బౌలింగ్‌ కోచ్‌)లు కూడా ఇందులో పని చేస్తారు. ప్రస్తుతం ఎన్‌సీఏ చాలా పని జరుగుతుంది. ఎన్‌సీఏను ఒక అత్యుద్భుత సెంటర్‌గా రూపొందించాలనే యత్నంలో ఉన్నాం’ అని గంగూలీ తెలిపాడు.

ఇక ద్రవిడ్‌తో భేటీకి సంబంధించి మాట్లాడుతూ.. ‘ ద్రవిడ్‌ ఎన్‌సీఏ హెడ్‌. క్రికెట్‌లో అతనొక దిగ్గజం. ఎన్‌సీఏ విధి నిర్వహణకు సంబంధించి నేను తెలుసుకోవాలని భావించే ద్రవిడ్‌తో సమావేశమయ్యా. ఎన్‌సీఏ కోసం కొత్త బిల్డింగ్‌ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మా మధ్య సమావేశం దాదాపు రెండు గంటలు జరిగింది. ఎన్‌సీఏను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ద్రవిడ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యా. ఎన్‌సీఏ పనితీరు చాలా బాగుంది.  బెంగళూరు నడిబొడ్డన ఎన్‌సీఏ ఉంది. అంతకంటే మంచి వేదిక ఇంకొటి దొరకదు’ అని గంగూలీ అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top