కోహ్లికి రహానేకి అదే తేడా : గంగూలీ | Rahane batting good as Kohli says Sourav Ganguly | Sakshi
Sakshi News home page

కోహ్లికి రహానేకి అదే తేడా : గంగూలీ

Feb 3 2018 10:14 AM | Updated on Feb 3 2018 10:14 AM

Rahane batting good as Kohli says Sourav Ganguly - Sakshi

ప్రాక్టీస్‌ సెషన్‌లో రహానే, కోహ్లి(ఫైల్‌ ఫొటో)

సాక్షి, స్పోర్ట్స్‌ : ఆతిథ్య సౌతాఫ్రికాను చిత్తుచేసి మొదటి వన్డేలో టీమిండియా సాధించిన ఘనవిజయంపై మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర కామెంట్లుచేశాడు. 270 పరుగుల లక్ష్యసాధనలో కోహ్లి సాధించిన సెంచరీ అద్భుతమే అయినప్పటికీ రహానే ఇన్నింగ్స్‌ అంతకంటే విలువైనదని అభిప్రాయపడ్డాడు. ‘ఇప్పుడున్న ఆటగాళ్లందరిలోకి రహానే క్లాస్‌ ప్లేయర్‌ అన్నది నిర్వివాదాంశం. సొగసైన బ్యాటింగ్‌తో అలరించే అతను.. తన అర్థసెంచరీలను సెంచరీలుగా మలుచుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. విరాట్‌ను చూడండి.. ఒక్కసారి సెట్‌ అయ్యాడంటే సెంచరీ కొట్టకుండా ఊరుకోడు. వాళ్లిద్దరికీ మధ్య అదే తేడా. ఈ విషయంలో కోహ్లి నుంచి రహానే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సారథితో డైనింగ్‌ టేబుల్‌ సంభాషణలు రహానేకి తప్పకుండా ఉపకరిస్తాయి’’ అని ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్‌లో గంగూలీ పేర్కొన్నాడు.

సౌతాఫ్రికా తప్పుచేసిందా! : సఫారీ గడ్డపై తొలిరెండు టెస్టులు దారుణంగా ఓడిపోయిన టీమిండియా.. మూడో టెస్టులో మాత్రం 63 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క విజయమే టీమిండియా యాటిట్యూడ్‌లో మార్పునకు కారణమైందని గంగూలీ అన్నారు. ‘‘మూడో టెస్టు అందించిన విజయంతో టీమిండియా గమనం పూర్తిగా మారింది. అదే ఊపులో మొదటి వన్డేను గెల్చుకుంది. ఇంకా ఐదు వన్డేలు, టీ20 సిరీస్‌ ఆడాల్సిన తరుణంలో ఈ మార్పు చాలా అవసరమని చెప్పాలి. ఇక దక్షిణాఫ్రికా.. తన తురుపుముక్కలైన డివిల్లీర్స్‌, స్టెయిన్‌లు లేకుండా బరిలోకి దిగాల్సిరావడం పూడ్చుకోలేని నష్టం. పైగా, టెస్టుల్లో ఇండియన్‌ బ్యాట్స్‌మన్లకు సవాలు విసిరిన ఇన్‌గిడి, ఫిలాండర్లను కూడా పక్కనపెట్టడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది’’ అని సౌరవ్‌ రాసుకొచ్చారు.

సౌతాఫ్రికాతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం డర్బన్‌లో జరిగిన ఫస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డే సెంచూరియన్‌ వేదికగా ఆదివారం(ఫిబ్రవరి 4)న జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement