బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు | PV Sindhu, unknown Nikhar Garg nominees in BWF Athletes ... | Sakshi
Sakshi News home page

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు

Apr 12 2017 12:08 AM | Updated on Sep 5 2017 8:32 AM

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు కోసం పోటీపడుతోంది.

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు కోసం పోటీపడుతోంది. మార్చి 27న నామినేషన్ల దరఖాస్తు గడువు ముగి యగా ఆరుగురు పురుష ఆటగాళ్లు, ముగ్గురు మహిళా క్రీడాకారిణులు ఎన్నికల బరిలో మిగిలారు. ప్రపంచ రెండో ర్యాంకర్‌ సింధుతో పాటు పురుషుల డబుల్స్‌లో ఇద్దరు మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే భారత్‌ నుంచి అంతగా పేరులేని డబుల్స్‌ ఆటగాడు నిఖర్‌ గార్గ్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశాడు. ముంబైకి చెందిన ఈ ఆటగాడు గతేడాది మేలో అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లు తమ సంఘాల ద్వారా కాకుండా నేరుగా రిజిష్టర్‌ చేసుకునే సౌకర్యాన్ని బీడబ్లు్యఎఫ్‌ కల్పించాలని ఆన్‌లైన్‌ పిటిషన్‌ ప్రారంభించాడు.

ఇక మొత్తంగా పోటీపడుతున్న తొమ్మిది మంది నుంచి ఖాళీగా ఉన్న నాలుగు స్థానాల్లో ఎంపికవుతారు. యుహాన్‌ టాన్‌ (బెల్జియం), క్రిస్టియాన్‌ విట్టింగస్‌ (డెన్మార్క్‌), గ్రేసియా పోలి (ఇండోనేసియా)ల నాలుగేళ్ల పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.  నిబంధనల ప్రకారం కనీసం ఒక పురుష, ఒక మహిళా ప్లేయర్‌ కచ్చితంగా ఎన్నికవాల్సి ఉంటుంది. ఇక మూడో వ్యక్తి ఎవరైనా ఆ తర్వాత అత్యధికంగా నమోదైన ఓట్ల ప్రకారం ఎన్నికవుతారు. మరోవైపు గతేడాది రాజీనామా చేసిన టాంగ్‌ యువాంటింగ్‌ స్థానంలో అదనంగా ఓ మహిళా క్రీడాకారిణి కూడా ఎంపికవుతారు. 2015లో ఆమె అథ్లెట్స్‌ కమిషన్‌లో చోటు దక్కించుకోగా గతేడాది బ్యాడ్మింటన్‌కు వీడ్కోలు ప్రకటించింది. అలాగే అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసింది. ఆమె మిగిలిన పదవీకాలాన్ని తాజాగా ఎన్నికయ్యే క్రీడాకారిణి భర్తీ చేస్తుంది.

ఇక తొలిసారిగా ఈ–మెయిల్‌ ద్వారా ఈనెల 26 నుంచి మే 24 వరకు ఓటింగ్‌ జరగనుంది. అలాగే అదే తేదీన ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే సుదిర్మన్‌ కప్‌లో పాల్గొనే ఆటగాళ్లు వ్యక్తిగతంగా స్టేడియంలోనే ఓటు వేయవచ్చు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు బీడబ్లు్యఎఫ్‌కు ఆటగాళ్లకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement