ఇది గర్వించాల్సిన సమయం

Pullela Gopichand feels Indian badminton is not dependent on just one or two players - Sakshi

 కామన్వెల్త్‌లో ఆటగాళ్ల ప్రదర్శనపై కోచ్‌ గోపీచంద్‌  

సాక్షి, హైదరాబాద్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో మునుపెన్నడూ లేని విధంగా గోల్డ్‌కోస్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత బ్యాడ్మింటన్‌ జట్టుపై జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ప్రశంసల జల్లు కురిపించారు. పటిష్టమైన మలేసియా జట్టును ఓడించి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో విజేతగా నిలవడమే మన సత్తాను చాటుతోందని అన్నారు. విజయాల కోసం కేవలం ఒకరిద్దరిపై మాత్రమే ఆధారపడే స్థాయి నుంచి, ప్రతి ఒక్కరూ పతకాలు గెలిచే స్థాయికి భారత బ్యాడ్మింటన్‌ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు.

కామన్వెల్త్‌ క్రీడల బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో భారత్‌ 6 పతకాలు సాధించింది. మహిళల సింగిల్స్‌లో సైనా (స్వర్ణం), సింధు (రజతం)... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ (రజతం), డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి జంట (రజతం), మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (కాంస్యం) ద్వయంతో పాటు టీమ్‌ ఈవెంట్‌లోనూ మనోళ్లు స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.  

ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన అనంతరం మంగళవారం గచ్చిబౌలిలోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత బృందం పాల్గొంది. ఈ సందర్భంగా కోచ్‌ గోపీచంద్‌ మాట్లాడుతూ... ‘బ్యాడ్మింటన్‌లో టీమ్‌ ఈవెంట్‌ స్వర్ణాన్ని అందుకుంటామని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది అందరి సమష్టి విజయం. గతంలో పతకం కోసం ఒక్కరో, ఇద్దరో ఆటగాళ్లపై మాత్రమే ఆధారపడేవాళ్లం.

కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరూ తమ అత్యుత్తమ ఆటతో భారత్‌కు పతకాన్ని అందించారు. బ్యాడ్మింటన్‌లో మన దశ మారింది. ఒక మెగా ఈవెంట్‌ ఫైనల్లో ఇద్దరు భారతీయులే తలపడేంతగా మన ఆట మెరుగైంది. ఇది గర్వించాల్సిన అంశం. నేను బ్యాడ్మింటన్‌ ఆడిన కాలంతో పోలిస్తే ఇప్పుడున్న పోటీ, ఆటగాళ్లపై అంచనాలు, బాధ్యతలు చాలా ఎక్కువ. అయినప్పటికీ వీరంతా నన్ను ఎప్పుడో దాటేశారు.

భవిష్యత్‌లో ఇంకా చాలా సాధిస్తారు. గోల్డ్‌కోస్ట్‌ ఘనతంతా డబుల్స్‌ క్రీడాకారిణి అశ్విని పొన్నప్పకే దక్కుతుంది. ఒకే రోజు వరుసగా ప్రాముఖ్యత కలిగిన 4 మ్యాచ్‌లాడి ఆమె మన పతకాల సంఖ్య పెరగడంలో కీలక పాత్ర పోషించింది. సాత్విక్, చిరాగ్, సిక్కి రెడ్డి కూడా అద్భుతంగా ఆడారు’ అని గోపీచంద్‌ విశ్లేషించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top