మెయిన్‌ ‘డ్రా’కు ప్రజ్నేశ్‌ అర్హత

Prajnesh Gunasekaran Australian Open updates - Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ

మెల్‌బోర్న్‌: భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ ప్లేయర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ మెయిన్‌ ‘డ్రా’లో ఆడనున్నాడు. టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌ ద్వారా ప్రజ్నేశ్‌ ప్రధాన టోర్నీకి అర్హత పొందాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ చివరి రౌండ్‌ మ్యాచ్‌లో 29 ఏళ్ల ప్రజ్నేశ్‌ 6–7 (5/7), 6–4, 6–4తో యోసుకె వతనుకి (జపాన్‌)పై విజయం సాధించాడు. ‘గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’లో ఆడాలని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నాను.

నేడు అది నిజమైంది. నా అనుభూతిని మాటల్లో వర్ణించలేను. నా కెరీర్‌లో ఇది పెద్ద ఘనత’ అని చెన్నైకి చెందిన ప్రజ్నేశ్‌ వ్యాఖ్యానించాడు. క్వాలిఫయింగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన ప్రజ్నేశ్‌కు ప్రైజ్‌మనీగా 40 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 20 లక్షలు 32 వేలు) లభించాయి. ఇక మెయిన్‌ ‘డ్రా’లో తొలి రౌండ్‌లో ఓడిపోయినా అతనికి మరో 75 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ. 38 లక్షల 10 వేలు) లభిస్తాయి. సోమవారం మొదలయ్యే ప్రధాన టోర్నమెంట్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో అమెరికా ప్లేయర్, ప్రపంచ 39వ ర్యాంకర్‌ ఫ్రాన్సెస్‌ టియాఫోతో ప్రపంచ 112వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ తలపడతాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top