రొనాల్డో మాయ... 

Portugal draws Spain on Ronaldo hat trick - Sakshi

‘హ్యాట్రిక్‌’తో అదరగొట్టిన పోర్చుగల్‌ కెప్టెన్‌

88వ నిమిషంలో  అద్భుత ఫ్రీ కిక్‌తో గోల్‌

స్పెయిన్‌తో మ్యాచ్‌ 3–3తో ‘డ్రా’

సమకాలీన ఫుట్‌బాల్‌లో తనను గొప్ప క్రీడాకారుడిగా ఎందుకు పరిగణిస్తారో పోర్చుగల్‌ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో నిరూపించాడు. మాజీ విశ్వవిజేత స్పెయిన్‌తో జరిగిన ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో రొనాల్డో అంతా తానై తన జట్టును ముందుండి నడిపించాడు. ఓటమి తప్పదనుకున్న స్థితిలో 25 గజాల దూరం నుంచి ఫ్రీ కిక్‌ను కళ్లు చెదిరే రీతిలో గోల్‌గా మలిచి చివరకు పోర్చుగల్‌కు ‘డ్రా’నందం కలిగించాడు.   

సోచి (రష్యా): ప్రొఫెషనల్‌ లీగ్‌లలో క్లబ్‌ జట్ల తరఫున ఎన్నో అద్భుత గోల్స్‌ చేసిన పోర్చుగల్‌ కెప్టెన్‌ క్రిస్టియానో రొనాల్డో అసలు సమరంలోనూ సత్తా చాటుకున్నాడు. వరుసగా నాలుగో ప్రపంచకప్‌ ఆడుతోన్న ఈ మేటి ఫార్వర్డ్‌ ప్లేయర్‌ స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపమే ప్రదర్శించాడు. ఒకవైపు స్పెయిన్‌ జట్టంతా ఆడుతున్నట్లు అనిపించగా... మరోవైపు రొనాల్డో ఒక్కడే పోర్చుగల్‌ను నడిపించాడు. ఈ క్రమంలో రొనాల్డో ‘హ్యాట్రిక్‌’ గోల్స్‌తో విజృంభించడంతో స్పెయిన్‌తో జరిగిన గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌ను పోర్చుగల్‌ 3–3తో ‘డ్రా’గా ముగించింది. ఫలితం తేలకపోవడంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్‌ లభించింది. పోర్చుగల్‌ తరఫున రొనాల్డో 4వ, 44వ, 88వ నిమిషాల్లో గోల్స్‌ చేశాడు. స్పెయిన్‌ జట్టుకు డిగో కోస్టా 24వ, 55వ నిమిషాల్లో రెండు గోల్స్‌ అందించగా... 58వ నిమిషంలో నాచో మరో గోల్‌ను సాధించాడు. తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఈనెల 20న మొరాకోతో పోర్చుగల్‌.... ఇరాన్‌తో స్పెయిన్‌ తలపడతాయి.  

తాను ఆడిన గత మూడు ప్రపంచకప్‌లలో (2006, 2010, 2014) కేవలం ఒక్కో గోల్‌ మాత్రమే చేసిన రొనాల్డో ఈసారి మాత్రం తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. 33 ఏళ్ల ఈ రియల్‌ మాడ్రిడ్‌ క్లబ్‌ ప్లేయర్‌ నాలుగో నిమిషంలోనే బోణీ చేశాడు. ‘డి’ బాక్స్‌లో రొనాల్డోను స్పెయిన్‌ ప్లేయర్‌ నాచో మొరటుగా అడ్డుకోవడంతో రిఫరీ పోర్చుగల్‌కు పెనాల్టీ కిక్‌ను ప్రకటించారు. రొనాల్డో ఎలాంటి తప్పిదం చేయకుండా బంతిని గోల్‌ పోస్ట్‌లోకి పంపించడంతో పోర్చుగల్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 20 నిమిషాల తర్వాత స్పెయిన్‌ స్కోరును సమం చేసింది. తొలి అర్ధభాగం ముగిసేందుకు మరో నిమిషం ఉందనగా గోల్‌ పోస్ట్‌ దిశగా రొనాల్డో బలంగా కొట్టిన కిక్‌ను స్పెయిన్‌ గోల్‌కీపర్‌ అడ్డుకోకపోవడంతో పోర్చుగల్‌ ఖాతాలో రెండో గోల్‌ చేరింది. రెండో అర్ధ భాగంలో స్పెయిన్‌ జోరు పెంచింది. మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పోర్చుగల్‌ దాడులను నిలువరిస్తూ విజయం దిశగా సాగిపోయింది. ఇక స్పెయిన్‌ ఖాతాలో విజయం చేరుతుందనగా అద్భుతం చోటు చేసుకుంది. 88వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను రొనాల్డో గోల్‌గా మలిచాడు.

►1    ప్రపంచకప్‌ చరిత్రలో ‘హ్యాట్రిక్‌’ సాధించిన పెద్ద వయస్కుడిగా రొనాల్డో (33 ఏళ్ల 130 రోజులు) రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు నెదర్లాండ్స్‌ ప్లేయర్‌ రాబ్‌ రెన్‌సెన్‌బ్రింక్‌ (30 ఏళ్ల 335 రోజులు) పేరిట ఉండేది. 1978 ప్రపంచకప్‌లో ఇరాన్‌పై రెన్‌సెన్‌బ్రింక్‌ ఈ ఘనత సాధించాడు. 
►4     నాలుగు వేర్వేరు ప్రపంచకప్‌లలో కనీసం ఒక గోల్‌ చేసిన నాలుగో ప్లేయర్‌గా రొనాల్డో గుర్తింపు పొందాడు. గతంలో మిరోస్లావ్‌ క్లోజ్, ఉవీ సీలార్‌ (జర్మనీ), పీలే (బ్రెజిల్‌) మాత్రమే ఈ ఘనత సాధించారు.  
►51    ప్రపంచకప్‌ చరిత్రలో ఇది 51వ హ్యాట్రిక్‌. వ్యక్తిగతంగా రొనాల్డో కెరీర్‌లోనూ ఇది 51వ హ్యాట్రిక్‌ కావడం విశేషం. 
►1    పోర్చుగల్‌ తరఫున ఆడుతూ డైరెక్ట్‌ ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచడం రొనాల్డో కెరీర్‌లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 45వ ప్రయత్నంలో రొనాల్డో ఇలా చేశాడు. 
►1    వరుసగా ఎనిమిది పెద్ద టోర్నీల్లో గోల్‌ చేసిన ఏకైక ప్లేయర్‌గా రొనాల్డో నిలిచాడు. 2004 యూరో టోర్నీ మొదలుకొని ప్రస్తుత ప్రపంచ కప్‌ వరకు అతని ఖాతాలో గోల్స్‌ చేరాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top