
ధోని కోసం ప్లాన్ చేశా
4-1-9-2... ఐపీఎల్‌లో ఇలాంటి గణాంకాలు సాధించడం ఏ బౌలర్‌కైనా పెద్ద ఘనత.
నా మీద నాకు నమ్మకం ఉంది: జహీర్‌ఖాన్
న్యూఢిల్లీ : 4-1-9-2... ఐపీఎల్‌లో ఇలాంటి గణాంకాలు సాధించడం ఏ బౌలర్‌కైనా పెద్ద ఘనత. ఏడాది కాలంగా క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉన్న బౌలర్ ఇలాంటి గొప్ప బౌలింగ్ చేశాడంటే అతను కచ్చితంగా దిగ్గజమే. చెన్నైతో మ్యాచ్‌లో భారత మాజీ స్టార్ జహీర్ ఖాన్ అద్భుతమైన స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. ఆరంభంలో స్మిత్, మెకల్లమ్‌లను పూర్తిగా కట్టడి చేసిన జహీర్... స్లాగ్ ఓవర్లలో తన తొలి బంతికే ధోనిని అవుట్ చేశాడు. ‘స్లాగ్ ఓవర్లలో ధోని ఎంత ప్రమాదకర ఆటగాడో అందరికీ తెలుసు.
అతణ్ని నియంత్రించాలంటే కచ్చితంగా ఓ మంచి ప్లాన్‌తో రావాలి. నేను అదే చేశా’ అని జహీర్ చెప్పాడు. యువ బౌలర్లకు ఎప్పుడూ తన సహకారం ఉంటుందని తెలిపాడు. ‘నేను జాతీయ జట్టులోకి వచ్చిన కొత్తలో సీనియర్ బౌలర్ల దగ్గరకు వెళ్లి సలహాలు అడిగేవాడిని. ఇప్పుడు ఢిల్లీ జట్టులో సీనియర్ బౌలర్‌గా మిగిలిన వాళ్లకు సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది’ అని అన్నాడు.
గాయాలు బాధిస్తున్న సమయంలో ఓపికగా నిరీక్షించాల్సిన అవసరం ఉందని జహీర్ అన్నాడు. ‘నేను ఏడాదిగా క్రికెట్‌కు దూరంగా ఉన్నా. నిజానికి ఇది చాలా అసహనాన్ని పెంచే అంశం. కానీ ఓపికగా ఎదురు చూడాలి. నా సామర్థ్యం మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉంది. నన్ను నేను నమ్ముతాను. కష్టపడతాను. అది కచ్చితంగా ఫలితాన్నిస్తుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటూ రెగ్యులర్‌గా ఆడటం మాత్రమే తన చేతుల్లో ఉందని, భారత జట్టులోకి రావడం తన చేతుల్లో లేదని చెప్పాడు.
‘ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు కొత్త అంశాలు నేర్చుకుంటూ అందుబాటులో ఉన్న మ్యాచ్‌లు ఆడటం మాత్రమే నా చేతుల్లో ఉంది. మిగతా అంశాలు నా పరిధిలోవి కాదు’ అని జహీర్ అన్నాడు. ఆటను ఆస్వాదిస్తూ క్రికెట్ పట్ల అంకితభావం ఉంటే రాణించవచ్చని యువ పేసర్లకు సూచించాడు.