
తండ్రిని మించిన తనయ!
గత కొన్నాళ్లుగా వాలీబాల్ మాజీ ఆటగాడు పీవీ రమణ ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: గత కొన్నాళ్లుగా వాలీబాల్ మాజీ ఆటగాడు పీవీ రమణ ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. కుమార్తె పీవీ సింధు విజయాలతో ఆయన పులకరించిపోతున్నారు. ఐబీఎల్ వేలంలో భారీ మొత్తానికి సింధు ఎంపిక కావడం, ఆ తర్వాత సంచలన విజయాలు, తాజాగా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలవడం ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. ఇప్పుడు ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ సింధు ‘అర్జున’ అవార్డుకు నామినేట్ అయింది. దీంతో రమణ ఉబ్బితబ్బిబ్బయ్యారు. తండ్రి, కూతురుకు విభిన్న క్రీడాంశాల్లో అర్జున అవార్డు రావడం చాలా గర్వంగా అనిపిస్తోందని ఆయన స్పందించారు. ‘నాకు తెలిసి భారత క్రీడా చరిత్రలో ఇలా సాధించినవారు ఎవరూ లేరు.
దాదాపు రెండేళ్లుగా నిలకడైన ప్రదర్శన ఇచ్చిన సింధు కష్టానికి ఫలితం దక్కింది. 18 ఏళ్ల వయసులోనే ఆమె ఈ పురస్కారానికి ఎంపిక కావడం నిజంగా మాటల్లో చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తోంది. ఇప్పుడు ఆమెపై మరింత బాధ్యత పెరిగింది.
భవిష్యత్తులోనూ బాగా ఆడి మరిన్ని విజయాలు అందుకోవాలన్నదే మా కోరిక’ అని రమణ పుత్రికోత్సాహంతో ‘సాక్షి’తో చెప్పారు. 1963లో పుట్టిన రమణ 38 ఏళ్ల వయసులో 2001లో అర్జున అవార్డు అందుకున్నారు. 1986లో సియోల్ ఆసియా క్రీడల్లో పతకం నెగ్గిన భారత సీనియర్ వాలీబాల్ జట్టులో ఆయన సభ్యుడు. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా దశాబ్దానికి పైగా ఆడినా ‘అర్జున’ ఆయన చెంతకు చేరడానికి దాదాపు పదిహేనేళ్లు పట్టింది.
అయితే ఇప్పుడు సింధు మాత్రం సీనియర్ సర్క్యూట్‌లోకి ప్రవేశించిన ఏడాది కాలానికే ఈ పురస్కారానికి ఎంపిక కావడం విశేషం. 16 ఏళ్ల వయసులోనే జాతీయ చాంపియన్‌గా నిలిచిన సింధు... అండర్-19 ఆసియా చాంపియన్‌షిప్ నెగ్గిన ఏకైక భారత క్రీడాకారిణి. యూత్ కామన్వెల్త్ గేమ్స్‌లోనూ ఆమె విజేతగా నిలిచింది. సీనియర్ విభాగంలో మాల్దీవ్స్ చాలెంజర్ టోర్నీ నెగ్గి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సింధు... ఈ ఏడాది మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గి కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది.