సెమీస్‌లో సింధు | P.V sindhu enters in semifinal | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సింధు

Nov 30 2013 12:52 AM | Updated on Sep 4 2018 5:07 PM

సెమీస్‌లో సింధు - Sakshi

సెమీస్‌లో సింధు

తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

 సాక్షి, హైదరాబాద్: తన విజయపరంపరను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మకావు సిటీలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సింధు 21-17, 21-12తో ఐదో సీడ్ సాజ్ కా చాన్ (హాంకాంగ్)పై అలవోకగా గెలిచింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు గేమ్‌ల చొప్పున ఆడి విజయం సాధించిన ఈ హైదరాబాద్ అమ్మాయి క్వార్టర్ ఫైనల్లో మాత్రం వరుస గేముల్లో విజయాన్ని దక్కించుకుంది.
 

 29 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు స్మాష్‌లతో ఎనిమిది పాయింట్లు, నెట్‌వద్ద ఆరు పాయింట్లు సాధించింది. గతంలో ఈ హాంకాంగ్ ప్లేయర్‌తో ఆడిన రెండుసార్లూ నెగ్గిన సింధు మూడోసారీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో సింధు ఒకదశలో 15-17తో వెనుకబడింది. అయితే ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌ను కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఆరంభంలోనే వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 7-1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె అదే జోరులో గేమ్‌ను, మ్యాచ్‌ను ముగించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో క్వాలిఫయర్, ప్రపంచ 780వ ర్యాంకర్ కిన్ జిన్‌జింగ్ (చైనా)తో సింధు ఆడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement