
చాంగ్‌వన్ (కొరియా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) రెండో ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భారత షూటర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్ ఒకే రజత పతకం సాధించి ఓవరాల్‌గా 12వ స్థానంతో సరిపెట్టుకుంది. గత నెలలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్ తొమ్మిది పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కానీ ఇక్కడ మాత్రం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. చివరిదైన పురుషుల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్ షీరాజ్ షేక్ 118 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో షాజర్ రిజ్వీ రజతం గెలిచి భారత్‌కు ఏకైక పతకాన్ని అందించాడు.