గ్లోవ్స్‌ కొనడానికి కూడా డబ్బుల్లేవు..

No Money To Replace Old Gloves,  Amit Trained Bare Handed - Sakshi

హరియాణా:ఆసియా క్రీడల్లో భారత యువ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రియో ఒలింపిక్‌ చాంపియన్‌ దుస్మతోవ్‌ను ఓడించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు. ఆసియా క్రీడల 49 కిలోల లైట్‌ ఫ్లై విభాగంలో అమిత్‌ 3-2తో విజయం సాధించి పసిడిని ముద్దాడాడు. అయితే, అమిత్‌ ఈ దశకు చేరుకోవడానికి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు. అతని క్రీడా పయనం అంతా సులువుగా ఏమీ సాగలేదు. హరియాణాలో మైనా గ్రామంలో జన్మించిన అమిత్‌ విజయాల వెనుక అతని అన్న అజయ్‌ త్యాగమే ప్రధానంగా కనిపిస్తోంది. బాక్సింగ్‌లో రాణిస్తున్న సమయంలో అతడి సోదరుడు అజయ్‌.. తమ్ముడు అమిత్‌ కోసం కెరీర్‌ను త్యాగం చేశాడు. వారిద్దరూ క్రీడల్లో ముందుకు సాగేందుకు వారి పేదరికం అడ్డుపడింది. 12 ఏళ్ల క్రితం అజయ్‌, అమిత్‌.. ఇద్దరూ హరియాణాలోని రోహ్‌తక్‌ సమీపంలోని మైనా గ్రామంలోని ప్రైవేట్‌ అకాడమీలో బాక్సింగ్‌ శిక్షణ కోసం చేరారు.

కొన్నాళ్లకు ఆర్థిక పరిస్థితుల కారణంగా బాక్సింగ్ ‌నుంచి అజయ్‌ తప్పుకున్నాడు. కుటుంబ పోషణ కోసం ఆర్మీలో చేరాడు. అనంతరం అమిత్‌ బాక్సింగ్‌ను కొనసాగించాడు. తన త్యాగం వృథాగా పోలేదని గతేడాది ఆసియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అమిత్‌ కాంస్యం గెలవడంతో తనకు ఎంతో సంతోషాన్నించిందని అజయ్‌ తెలిపాడు. తాజాగా ఆసియా క్రీడల్లో అమిత్‌ స్వర్ణం గెలిచి హీరోగా నిలవడంతో తన ఆనందానికి అవధులు లేవని చెబుతున్నాడు.

త్యాగానికి మంచి ప్రతిఫలం లభించిందని పేర్కొన్నాడు. ‘మా ఇద్దరికీ బాక్సింగ్‌ గ్లోవ్స్‌ కొనివ్వడానికి కూడా మా నాన్న వద్ద డబ్బులు ఉండేవి కావు. ఒట్టి చేతులతోనే శిక్షణ తీసుకోవాల్సి వచ్చేది. అమిత్‌ అలానే బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. మరొకవైపు బాక్సింగ్‌లో రాణించాలంటే మంచి ఆహారం కూడా తీసుకోవాలి. అది ఖర్చుతో కూడుకున్నది. నా తమ్ముడైనా బాక్సింగ్‌లో రాణించాలని నేను త్యాగం చేశాను. ఆర్మీలో చేరాను' అని అజయ్‌ అనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు.

భారత్‌ పసిడి పంచ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top