22 నుంచి జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌

National Weightlifting Championship in Visakhapatnam - Sakshi

రైల్వే స్పోర్ట్స్‌ ఇండోర్‌ ఎన్‌క్లేవ్‌లో పోటీలు

మూడు వేలకుపైగా అథ్లెట్ల రాక

విశాఖ స్పోర్ట్స్‌: జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ లోగోను వాల్తేర్‌ రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ ముకుల్‌ శరణ్‌ మాథుర్‌ మంగళవారం ఆవిష్కరించారు. డీఆర్‌ఎం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టోర్నీ ప్రారంభ కార్యక్రమం ఈనెల 21న, పోటీలు ఈనెల 22 నుంచి 28వ తేదీ వరకు రైల్వే స్పోర్ట్స్‌ ఇండోర్‌ ఎన్‌క్లేవ్‌లో జరగనున్నాయన్నారు. ఈ చాంపియన్‌షిప్‌లో రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు(ఆర్‌ఎస్‌పీబీ)జట్టు పాల్గొంటుందన్నారు. వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య మెన్, వుమెన్‌ కేటగిరిల్లో నిర్వహించే చాంపియన్‌షిప్‌ బాధ్యతను ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే.. వాల్తేర్‌కు అప్పగించిందన్నారు. ఆర్‌ఎస్‌పీబీ తరపున మూడు వేలకు పైగా అథ్లెట్లు 29 క్రీడాంశాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పాల్గొంటున్నారన్నారు. సర్వీసెస్, రైల్వేస్, పోలీస్‌ తదితర బోర్డులతోపాటు 29 రాష్ట్రాలకు చెందిన మెన్, వుమెన్‌ వెయిట్‌లిఫ్టర్లు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొనున్నారన్నారు. ఈ సమావేశంలో ఈకోర్సా వాల్తేర్‌ క్రీడాధికారి సాకీర్‌హుస్సేన్, ఆర్‌ఎస్‌పీబీ ప్రతినిధులు రవీందర్‌ కుమార్, ప్రవీణ్‌కుమార్, ఆనందకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

హాజరుకానున్న అంతర్జాతీయ మెడలిస్ట్‌లు
రైల్వేస్టేడియంలో జరగనున్న నేషనల్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిరాబాయ్‌ చానుతోపాటు పలువురు కామన్‌వెల్త్‌ పాల్గొన్న క్రీడాకారులు పూనమ్‌ యాదవ్, గురురాజ, రాహుల్, గురుదీప్‌సింగ్, ప్రదీప్‌ సింగ్,విశ్వాస్‌ ఠాకూర్, స్వాతిసింగ్, ఎం.సంతోషి పాల్గొనున్నారు. గతేడాది వరకు ఎనిమిది వెయిట్‌ కేటగిరిల్లోనే జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీలు నిర్వహించగా ఈసారి పది వెయిట్‌ కేటగిరిల్లో మెన్, వుమెన్‌కు పోటీలు జరగనున్నాయి. గతంలో మహిళా పోటీలు 48 కేజీల వెయిట్‌ నుంచి జరగ్గా ఈసారి 45 కేజీల వెయిట్‌ నుంచే ప్రారంభం కానున్నాయి. మెన్‌లో 55 కేజీల వెయిట్‌ నుంచి ప్రారంభమై 109+ కేజీల వరకు పది వెయిట్స్‌లో... మహిళలకు 45 కేజీల వెయిట్‌ నుంచి 87+ కేజీల వెయిట్‌ వరకు పది వెయిట్స్‌లో పోటీలు నిర్వహించనున్నారు. మెన్‌ 81 కేజీల వెయిట్‌లో అత్యధికంగా 19 మంది పోటీపడనుండగా వుమెన్‌ 49 కేజీల వెయిట్‌లో అత్యధికంగా 19 మంది విజేతగా నిలిచేందుకు పోటీపడనున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top