వారెవ్వా... విజయ్ | Murali Vijay's ton takes India to comfortable position against England | Sakshi
Sakshi News home page

వారెవ్వా... విజయ్

Jul 10 2014 12:40 AM | Updated on Sep 2 2017 10:03 AM

వారెవ్వా... విజయ్

వారెవ్వా... విజయ్

చాలా కాలం తర్వాత మురళీ విజయ్ టెస్టుల్లో సత్తా చాటుకున్నాడు. టాప్ ప్లేయర్లు విఫలమైన పిచ్‌పై అజేయ సెంచరీతో చెలరేగాడు.

విదేశాల్లో మురళీ తొలి సెంచరీ
 భారత్ 259/4  
 ధోని అర్ధసెంచరీ
 
 ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను భారత్ ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. ఓపెనర్ మురళీ విజయ్ నాణ్యమైన ఇన్నింగ్స్‌తో గౌరవప్రదంగా తొలిరోజును ముగించింది. నాటింగ్‌హామ్‌లో ఉపఖండం తరహా పిచ్ ఎదురుకావడం... ఇంగ్లండ్ జట్టులో నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడంతో ధోనిసేన ఆత్మవిశ్వాసం పెరిగింది.
 
 నాటింగ్‌హామ్: చాలా కాలం తర్వాత మురళీ విజయ్ టెస్టుల్లో సత్తా చాటుకున్నాడు. టాప్ ప్లేయర్లు విఫలమైన పిచ్‌పై అజేయ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసింది.
 
  విజయ్ (294 బంతుల్లో 122 బ్యాటింగ్; 20 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (64 బంతుల్లో 50 బ్యాటింగ్; 5 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలో తడబడింది. విజయ్ నిలకడను చూపెట్టినా రెండో ఎండ్‌లో ధావన్ (24 బంతుల్లో 12) నిరాశపర్చాడు. అయితే పుజారా (69 బంతుల్లో 38; 7 ఫోర్లు) నెమ్మదిగా ఆడటంతో లంచ్ వరకు భారత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. కానీ లంచ్ తర్వాత అండర్సన్, బ్రాడ్ రివర్స్ స్వింగ్‌తో చెలరేగారు. ఒక పరుగు తేడాతో పుజారా, కోహ్లి (1) అవుట్ కావడంతో భారత్ 107 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయ్‌తో జత కలిసిన రహానే (81 బంతుల్లో 32; 4 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా భారీ స్కోరు చేయలేకపోయాడు.
 
 ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. టీ తర్వాత విజయ్ 214 బంతుల్లో  కెరీర్‌లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. విదేశీ గడ్డపై తనకి ఇదే తొలి శతకం. ఆ తర్వాత ధోని సమయోచితంగా ఆడుతూ కాస్త దూకుడు చూపించి అర్ధసెంచరీ చేశాడు. అండర్సన్ 2 వికెట్లు తీయగా... బ్రాడ్, ప్లంకెట్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన స్టువర్ట్ బిన్నీ భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడుతున్న 281వ ఆటగాడు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ బ్యాటింగ్ 122; ధావన్ (సి) ప్రయర్ (బి) అండర్సన్ 12; పుజారా (సి) బెల్ (బి) అండర్సన్ 38; కోహ్లి (సి) బెల్ (బి) బ్రాడ్ 1; రహానే (సి) కుక్ (బి) ప్లంకెట్ 32; ధోని బ్యాటింగ్ 50; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 259.
 వికెట్ల పతనం: 1-33; 2-106; 3-107; 4-178
 
 బౌలింగ్: అండర్సన్ 21-6-70-2; బ్రాడ్ 19-8-26-1; స్టోక్స్ 19-4-47-0; ప్లంకెట్ 21-4-56-1; అలీ 9-0-50-0; రూట్ 1-0-6-0.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement