
రవిశాస్త్రి లైన్ దాటాడు: మంజ్రేకర్
దక్షిణాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా ముంబైలోని వాంఖేడ్ పిచ్ ను తయారుచేసిన క్యూరేటర్ సుధీర్ నాయక్ పై టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి విమర్శలు చేయడాన్ని సహచర మాజీ ఆటగాడు, ప్రముఖ్య వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో చివరి వన్డే సందర్భంగా ముంబైలోని వాంఖేడ్ పిచ్ ను తయారుచేసిన క్యూరేటర్ సుధీర్ నాయక్ పై టీమిండియా డైరెక్టర్ గా ఉన్న రవిశాస్త్రి విమర్శలు చేయడాన్ని సహచర మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. ముంబైలో టీమిండియా ఓటమి పాలైనందుకు పిచ్ క్యూరేటర్ గా వ్యవహరించినసుధీర్ పై రవిశాస్త్రి అసహనం వ్యక్తం చేయడం సరైన పద్దతి కాదన్నాడు. నాయక్ తో క్రికెట్ జ్ఞాపకాలను రోజులను గుర్తు చేసుకున్న మంజ్రేకర్.. రవిశాస్త్రి తన హద్దులు దాటి ప్రవర్తించాడని విమర్శించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన మంజ్రేకర్.. ఒక క్యూరేటర్ ను తిట్టిన టీమిండియా డైరెక్టర్ లైన్ ను దాటి ప్రవర్తించాడని పేర్కొన్నాడు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని మంజ్రేకర్ హితవు పలికాడు. ఓ టెస్టు క్రికెటర్ అయిన సుధీర్ పట్ల దురుసుగా ప్రవర్తించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని మంజ్రేకర్ స్పష్టం చేశాడు.
చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం డైరెక్టర్ రవిశాస్త్రి ఆ కోపాన్ని పిచ్ క్యురేటర్‌పై చూపించిన సంగతి తెలిసిందే. తాము కోరినట్లుగా స్పిన్ పిచ్ రూపొందించలేదంటూ వాంఖడే క్యురేటర్ సుధీర్ నాయక్‌ను అతను తిట్టిపోశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిశాక గ్రేట్ వికెట్ అంటూ వ్యంగ్యంతో మొదలు పెట్టి అతను మరాఠీలో బూతు పురాణం లంకించుకోవడంతో అక్కడ ఉన్నవారందరూ విస్తుపోయారు. దీనిపై మంగళవారం సుధీర్ నాయక్ అధికారికంగా ముంబై క్రికెట్ సంఘానికి ఫిర్యాదు చేశాడు. తనను రవిశాస్త్రి తిట్టాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై ఎంసీఏ అక్టోబర్ 30 వ తేదీన సమావేశం కానుంది. ఆ రోజు జరిగిన విషయాన్ని నాయక్ తమ దృష్టికి తీసుకొచ్చాడని ఎంసీఏ జాయింట్ సెక్రటరీ పీవీ శెట్టి తెలిపారు. ఈ వ్యవహారాన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
Ravi Shastri completely out of line to abuse Sudhir Naik, curator at Wankhede. Showed disrespect to age & fellow test cricketer.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 27, 2015