శ్రమ వృథా | Mahendra Singh Dhoni century did not helpful to Team india | Sakshi
Sakshi News home page

శ్రమ వృథా

Oct 20 2013 1:12 AM | Updated on Sep 1 2017 11:47 PM

శ్రమ వృథా

శ్రమ వృథా

ఆస్ట్రేలియా విజయానికి చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. వోజెస్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌లో ఉన్నారు.

ఓ గొప్ప ఇన్నింగ్స్... బూడిదలో పోసిన పన్నీరయింది. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్‌తో ధోని భారత్ చేతిలోకి తెచ్చిన విజయావకాశాన్ని... ఇషాంత్ శర్మ ఒకే ఒక్క ఓవర్‌తో దూరం చేశాడు. ఇక భారత్ విజయం లాంఛనమే అనుకున్న మ్యాచ్‌ను... ఫాల్క్‌నర్ మెరుపు ఇన్నింగ్స్‌తో లాక్కెళ్లిపోయాడు. ఐపీఎల్‌లో నేర్చుకున్న దూకుడును ఆసీస్ బౌలర్ ఫాల్క్‌నర్ భారత్ మీదే చూపించాడు.
 
 మొహాలీ: ఆస్ట్రేలియా విజయానికి చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. వోజెస్ మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌లో ఉన్నారు. ఈ దశలో భారత్ విజయం లాంఛనం. కానీ అనిశ్చితికి మారుపేరైన క్రికెట్ లో ఫలితాన్ని మార్చడానికి ఒక్క ఓవర్ చాలు. మొహాలీ వన్డేలోనూ ఇదే జరిగింది. ఇషాంత్ శర్మ చెత్త బంతులతో ఒకే ఓవర్లో 30 పరుగులు సమర్పించడంతో... గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. శనివారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది.  కెప్టెన్ ధోని (121 బంతుల్లో 139 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాధించగా... కోహ్లి (73 బంతుల్లో 68; 9 ఫోర్లు) రాణించాడు. జాన్సన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. ఫాల్క్‌నర్ (29 బంతుల్లో 64 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌తో పాటు వోజెస్ (88 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు) రాణించడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం ఆసీస్ సొంతమైంది. ఏడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది.
 
 కోహ్లి నిలకడ
 గత మ్యాచ్‌లో అద్భుత విజయాన్ని అందించిన భారత ఓపెనింగ్ జోడి ఈ సారి త్వరగానే పెవిలియన్ ముఖం పట్టింది. మెక్‌కే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 2 ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన ధావన్ (8) చివరి బంతికి అవుటయ్యాడు. కొద్ది సేపటికే రోహిత్ శర్మ (11) కూడా వెనుదిరిగాడు. మరో వైపు కోహ్లి మాత్రం ఆరంభం నుంచే జోరుగా ఆడాడు. జాన్సన్, వాట్సన్ ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు బాదాడు.
 
 అయితే షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ రైనా (17) జాన్సన్ బౌలింగ్‌లో చివరకు అదే బంతికి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాతి బంతికే యువరాజ్ (0)ను అవుట్ చేసి జాన్సన్ మరో షాకిచ్చాడు. తొలి వన్డే తరహాలోనే దూరంగా వెళుతున్న బంతిని వేటాడి యువీ డకౌటయ్యాడు. ఆ తర్వాత కోహ్లి, కెప్టెన్ ధోని కలిసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేయగా...ఈ దశలో ఆసీస్ బౌలర్లు కూడా కట్టడి చేయడంతో మరో వైపు పరుగుల వేగం కూడా తగ్గింది.
 
 మరో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 54 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం కోహ్లి అవుట్ కాగా, రవీంద్ర జడేజా (2) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ దశలో అశ్విన్ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) అండగా నిలవడంతో ధోని చెలరేగిపోయాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 76 పరుగులు జత చేశారు. ధోని 105 పరుగులవద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బెయిలీ వదిలేయడంతో చివరి వరకు అజేయంగా నిలిచిన కెప్టెన్, జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు.
 
 రాణించిన వోజెస్
 భారత గడ్డపై గత పదేళ్లలో 250కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్క సారిగా కూడా ఛేదించలేకపోయిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఫించ్ (44 బంతుల్లో 38; 6 ఫోర్లు), హ్యూస్ (22) మరోసారి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు సమన్వయంతో ఆడుతూ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. తొలి వికెట్‌కు 68 పరుగులు జత చేసిన అనంతరం వినయ్‌కుమార్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. కట్ చేయబోయిన హ్యూస్, కీపర్ చేతికి చిక్కాడు. కొద్ది సేపటికే ఫించ్‌ను ఇషాంత్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, మరో ఆరు పరుగులకే వాట్సన్ (11) కూడా జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ బెయిలీ (60 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్), వోజెస్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 83 పరుగులు జోడించారు.  అయితే ఒకే ఓవర్లో బెయిలీ, మ్యాక్స్‌వెల్ (3) అవుట్ కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బ తీసింది. అయితే వోజెస్ ఒక వైపు నిలకడగా ఆడగా...ఫాల్క్‌నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆసీస్‌కు అనూహ్య విజయాన్ని అందించింది.
 
 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఫించ్ (బి) వాట్సన్ 11; ధావన్ (సి) హాడిన్ (బి) మెక్‌కే 8; కోహ్లి (సి) హాడిన్ (బి) మ్యాక్స్‌వెల్ 68; రైనా (సి) వాట్సన్ (బి) జాన్సన్ 17; యువరాజ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 0; ధోని (నాటౌట్) 139; జడేజా (సి) హాడిన్ (బి) జాన్సన్ 2; అశ్విన్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 28; భువనేశ్వర్ (సి) బెయిలీ (బి) ఫాల్క్‌నర్ 10; వినయ్ కుమార్ (రనౌట్) 0; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 13, వైడ్ 7) 20; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 303.
 
 వికెట్ల పతనం: 1-14; 2-37; 3-76; 4-76; 5-148; 6-154; 7-230; 8-267; 9-299.
 బౌలింగ్: జాన్సన్ 10-1-46-4; మెక్‌కే 10-0-49-1; వాట్సన్ 8-0-74-1; ఫాల్క్‌నర్ 10-0-65-1; డోహర్తి 10-0-45-0; వోజెస్ 1-0-3-0; మ్యాక్స్‌వెల్ 1-0-8-1.
 ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) ధోని (బి) వినయ్ 22; ఫించ్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 38; వాట్సన్ (ఎల్బీ) (బి) జడేజా 11; బెయిలీ (ఎల్బీ) (బి) వినయ్ 43; వోజెస్ (నాటౌట్) 76; మ్యాక్స్‌వెల్ (రనౌట్) 3; హాడిన్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 24; ఫాల్క్‌నర్ (నాటౌట్) 64; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 14, వైడ్ 9) 23; మొత్తం (49.3 ఓవర్లలో 6 వికెట్లకు) 304.
 
 వికెట్ల పతనం: 1-68; 2-82; 3-88; 4-171; 5-174; 6-213.
 బౌలింగ్: భువనేశ్వర్ 10-1-50-1; వినయ్ 8.3-0-50-2; ఇషాంత్ 8-1-63-1; జడేజా 10-0-31-1; యువరాజ్ 3-0-20-0; అశ్విన్ 9-0-58-0; కోహ్లి 1-0-18-0.
 
 కెప్టెన్ ‘క్లాసిక్’
 
 ఒకటా...రెండా...ఎన్ని అద్భుత ఇన్నింగ్స్. వన్డేల్లో ఆరో స్థానంలోనో, ఏడో స్థానంలోనో బరిలోకి దిగడం, చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం మహేంద్ర సింగ్ ధోనికి మంచినీళ్ల ప్రాయంగా మారిపోయింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా, వికెట్లు పడిపోయి వెంటిలేటర్ మీద ఉన్న ఇన్నింగ్స్‌కు ఊపిరి పోయాలన్నా అది ధోనికే సాధ్యం అన్నట్లుగా భారత వన్డే ముఖచిత్రం మారిపోయింది.
 
 తాజాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ అతను విశ్వరూపం చూపించాడు. దాదాపు పది నెలల క్రితం ధోని ఆఖరి సారిగా సెంచరీ (పాక్‌పై) చేశాడు. అందులో భారత జట్టు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగి తన బ్యాట్ పదును చూపించాడు. భారత్ ఓడిపోయినా... శనివారం ఆసీస్‌పై అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక క్లాసిక్‌గా చెప్పుకోవచ్చు.
 
 నొప్పిని అధిగమించి...
 భారత్ స్కోరు 76/4 పరుగులు ఉన్నప్పుడు కెప్టెన్ క్రీజ్‌లోకి వచ్చాడు. ఇంకా బంతిని ఎదుర్కోనే లేదు. కోహ్లి ఆడిన షాట్‌కు రెండో పరుగు తీయబోయి మడమ మడత పడటంతో నొప్పితో బాధపడి ఫిజియోను పిలవాల్సి వచ్చింది. ఈ స్థితినుంచి అతను వన్డేల్లో మరో మరపు రాని శతకాన్ని అందుకున్నాడు.
 
  సింగిల్స్‌ను చక్కగా అంచనా వేస్తూ, చెత్త బంతులను బౌండరీకి తరలించిన కెప్టెన్, చివర్లో సిక్సర్లతో హోరెత్తించాడు. సింగిల్స్‌ను కాదని, మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ను కాపాడుకుంటూ స్ట్రైకింగ్ నిలుపుకున్న అతని చాతుర్యం చివర్లో బాగా పని చేసింది. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించిన అతను తొలి 67 బంతుల్లో ఒకటే ఫోర్ కొట్టాడు. 77 బంతులకు గానీ అతని అర్ధసెంచరీ పూర్తి కాలేదు. అయితే తర్వాత 50 పరుగులు చేయడానికి ధోనికి 30 బంతులే సరిపోయాయి. చక్కటి పుల్ షాట్లతో పాటు ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. చివర్లో చెలరేగిపోయే తన శైలిని ఈ మ్యాచ్‌లోనూ ధోని రుచి చూపించాడు. ఫాల్క్‌నర్ వేసిన 48వ ఓవర్ రెండో బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా తరలించి 107 బంతుల్లో కెరీర్‌లో 9వ సెంచరీ నమోదు చేసిన ధోని, మొహాలీ మైదానంలో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆఖరి మూడు ఓవర్లలో 47 పరుగులు  (11, 15, 21) రాగా, రెండు వైడ్లు మినహా, అతనొక్కడే 5 ఫోర్లు, 3 సిక్స్‌లు సహా 45 పరుగులు చేయడం విశేషం. ధోని జోరును ప్రేక్షకుల మాదిరిగా ఆస్వాదించడం మినహా ఆసీస్ బౌలర్లు ఏమీ చేయలేక చేతులెత్తేశారు.
 
 4,6,6,2,6,6
 
 47 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 260/6. విజయానికి ఆ జట్టు మరో 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. జేమ్స్ ఫాల్క్‌నర్ క్రీజ్‌లో ఉండగా ఇషాంత్ శర్మ బౌలింగ్‌కు దిగాడు. అయితే ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. తన చెత్త ప్రదర్శనను శిఖరానికి తీసుకెళుతూ ఇషాంత్ విసిరిన షార్ట్ బంతులపై ఫాల్క్‌నర్ విరుచుకు పడ్డాడు.
 
 ఇన్నింగ్స్ 48వ ఓవర్లో 4 సిక్స్‌లు, ఫోరు సహా ఫాల్క్‌నర్ 30 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో వరుసగా 4,6,6,2,6,6 పరుగులు చేసిన ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. తర్వాతి ఓవర్లో కాస్త నెమ్మదించినా...వినయ్ వేసిన 50వ ఓవర్ మూడో బంతికి మరో సిక్స్ కొట్టి ఫాల్క్‌నర్ గెలుపు పూర్తి చేశాడు.
 
 భారత్ తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (30) ఇచ్చిన బౌలర్‌గా ఇషాంత్. గతంలో యువరాజ్ కూడా ఒకే ఓవర్లో 30 ఇచ్పాడు.
 
 3 కెప్టెన్‌గా ధోని వన్డేల్లో 5 వేలు పరుగులు పూర్తి చేసుకున్నాడు. అజహర్, గంగూలీ తర్వాత ఈ ఘనత సాధించిన సారథి ధోని .
 
 బౌలర్లకు ధోని చురక
 
 సాధారణంగా ఓడిపోయినా మామూలుగా ఉండే కెప్టెన్ కూల్ ధోని... ఈసారి మాత్రం కాస్త ఫీలయ్యాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం, ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లు అదే తప్పులు చేస్తుండటం ధోనికి విసుగు తెప్పించినట్లున్నాయి. ‘అంతర్జాతీయ స్థాయిలో స్పూన్‌ఫీడ్ చేయాలంటే కుదరదు. ప్రతి ఒక్కరూ తమ బలం గుర్తించి, వ్యూహాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయాలి. ప్రతిసారీ అదే తరహాలో విఫలమయితే ఏం చేస్తాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మంచు ప్రభావం కాస్త ఉన్నా... పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement