
న్యూఢిల్లీ: భారత వన్డే ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన మదన్‌లాల్ (1983), గౌతమ్ గంభీర్ (2011)లు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులుగా నియమితులు కానున్నారు. సెలక్షన్ కమిటీల ఎంపిక కోసం బీసీసీఐ కొత్త సీఏసీని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందులో మాజీ మహిళా క్రికెటర్ సులక్షణ నాయక్‌ను మూడో సభ్యురాలిగా చేర్చే అవకాశాలున్నాయి. భారత్ నెగ్గిన తొలి వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మదన్‌లాల్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించనున్నట్లు తెలిసింది. వచ్చే నాలుగేళ్ల పాటు పదవిలో ఉండే రెండు సెలక్షన్ కమిటీ (సీనియర్, జూనియర్)లను మదన్ లాల్ కమిటీ ఎంపిక చేయనుంది. ప్రస్తుత సీనియర్ సెలక్షన్ కమిటీలో చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్‌జోన్), గగన్ ఖొడా (సెంట్రల్)ల పదవీ కాలం ముగియగా.... ఇతర సభ్యులైన శరణ్‌దీప్ సింగ్ (నార్త్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్), జతిన్ పరంజపే (వెస్ట్)లకు మరో ఏడాది కాలం గడువుంది.