రసెల్‌కు తోడుగా బ్రాత్‌వైట్‌..

KKR bring in Denly, Ferguson and Brathwaite Against Delhi Capitals - Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో భాగంగా ఇక్కడ ఈడెన్‌ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ కోల్‌కతా ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందగా, ఢిల్లీ ఆరు మ్యాచ్‌లకు గాను మూడింట విజయం సాధించింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్‌ ఓవర్‌లో విజయం సాధించింది.

అయితే ఈ సీజన్‌లో కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ తొలి మ్యాచ్‌ ఆడటానికి రంగం సిద్ధమైంది. అతనికి కేకేఆర్‌ తుది జట్టులో చోటు దక్కింది. ఇప్పటికే రసెల్‌ చెలరేగి పోతుంటే అతని జతగా ఆల్‌ రౌండర్‌ బ్రాత్‌వైట్‌కు చోటు కల్పించడం కేకేఆర్‌ మరింత బలోపేతంగా కనబడుతోంది. మొత్తంగా చూస్తే కేకేఆర్‌ మూడు మార్పులతో పోరుకు సిద్ధమైంది. ఫెర్గ్యుసన, జో డెన్లీ, బ్రాత్‌వైట్‌లను తుది జట్టులోకి తీసుకోగా, సునీల్‌ నరైన్‌, క్రిస్‌ లిన్‌, గర్నీలకు విశ్రాంతినిచ్చారు. ఇక ఢిల్లీ ఒక మార్పు చేసింది. లామ్‌చెన్‌ స్థానంలో కీమో పాల్‌కు చోటు కల్పించారు.

ఫుల్‌ స్వింగ్‌లో రసెల్‌..

ఐపీఎల్‌లో భీకరమైన ఫామ్‌లో ఉండి ప్రత్యర్థి జట్లకు చెమటపట్టిస్తున్న ఆటగాడెవరెంటే నిస్సందేహంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు ఆండ్రూ రసెలే. ఇప్పటివరకూ కేకేఆర్‌ ఆడిన మ్యాచ్‌ల్లో రస్సెల్‌ విజృంభించిన తీరు దీనికి నిదర్శనం. ఆరు మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్‌ 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉందంటే అది రస్సెల్‌ చలవే. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ విధ్వంసక వీరుడు 257 పరుగులు సాధించాడు.

ఇందులో 150 పరుగులు ఏకంగా సిక్సర్ల రూపంలోనే వచ్చాయి. ఇంతగా విజృంభిస్తున్న రసెల్‌ను కట్టడి చేసింది.. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ కాగిసో రబడ మాత్రమే. ఢిల్లీలోని ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో.. సూపర్‌ ఓవర్లో రబడ అద్భుతమైన యార్కర్‌తో రస్సెల్‌ను పెవిలియన్‌కు చేర్చి తమ జట్టుకు విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కోల్‌కతా వేదికగా ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఇందులోనూ ఈ ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు సాగడం ఖాయం.

కేకేఆర్‌
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), జో డెన్లీ, రాబిన్‌ ఊతప్ప, నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌, ఆండ్రీ రసెల్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, పీయూష్‌ చావ్లా, కుల్దీప్‌ యాదవ్‌, ఫెర్గ్యుసన్‌, ప‍్రసీద్ద్‌ క్రిష్ణ

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, కొలిన్‌ ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, అక్షర్‌ పటేల్‌, రాహుల్‌ తెవాతియా, కీమో పాల్‌, కగిసో రబడా, ఇషాంత్‌ శర్మ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top