గట్టెక్కిన శ్రీకాంత్ | Kidambi Srikanth, Parupalli Kashyap advance to third round of Syed Modi Badminton | Sakshi
Sakshi News home page

గట్టెక్కిన శ్రీకాంత్

Jan 22 2015 12:39 AM | Updated on Sep 2 2017 8:02 PM

గట్టెక్కిన శ్రీకాంత్

గట్టెక్కిన శ్రీకాంత్

ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు గట్టిపోటీ ఎదురైంది.

ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం

లక్నో: ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు గట్టిపోటీ ఎదురైంది. సయ్యద్ మోడి స్మారక గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ యువతార రెండో రౌండ్‌లో మ్యాచ్ పాయింట్ కాపాడుకొని విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-14, 21-13తో శ్రేయాన్ష్ జైస్వాల్ (భారత్)పై అలవోకగా నెగ్గగా... రెండో రౌండ్‌లో 18-21, 21-13, 22-20తో కియాన్ మెంగ్ తాన్ (మలేసియా)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.

57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ తొలి గేమ్‌ను కోల్పోయాడు. రెండో గేమ్‌ను కైవసం చేసుకొని మ్యాచ్‌లో నిలిచిన ఈ ప్రపంచ నాలుగో ర్యాంకర్ నిర్ణాయక మూడో గేమ్‌లో 19-15తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచాడు. అయితే ఈ దశలో శ్రీకాంత్ వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 19-20తో ఓటమి అంచుల్లోకి వచ్చాడు.

కానీ వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 22-20తో గేమ్‌ను, మ్యాచ్‌ను దక్కించుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-14తో అంకిత్ చికారా (భారత్)పై, గురుసాయిదత్ 21-14, 21-15తో డారెన్ లూ (మలేసియా)పై, సాయిప్రణీత్ 21-14, 21-10తో గౌరవ్ వెంకట్ (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత్‌కే చెందిన అరవింద్ భట్, ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
 
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్, నిరుటి రన్నరప్ పి.వి.సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో టాప్ సీడ్ సైనా 21-17, 21-12తో యిన్ ఫన్ లిమ్ (మలేసియా)పై, మూడో సీడ్ సింధు 21-6, 21-12తో ఏక్తా కాలియా (భారత్)పై గెలిచారు.  రుత్విక శివాని 9-21, 10-21తో ప్రపంచ చాంపియన్ కరోలినా  (స్పెయిన్) చేతిలో ఓడింది.
 
పురుషుల డబుల్స్‌లో కోనా తరుణ్-సంతోష్ రావూరి; సుమీత్ రెడ్డి-మనూ అత్రి; నందగోపాల్-అర్జున్ కుమార్ ; హేమనాగేంద్ర -అరుణ్ జంటలు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి వెళ్లాయి. మహిళల డబుల్స్‌లో జమునా రాణి-లీలా లక్ష్మీ; మేఘన-మనీషా;  ప్రమద-ప్రజ్ఞా రాయ్; సుధా కల్యాణి-రియా ముఖర్జీ; జ్వాల-అశ్విని  జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కి చేరాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement