శ్రీకాంత్‌కు చుక్కెదురు

Kidambi Srikanth bows out - Sakshi

ప్రిక్వార్టర్స్‌లో మలేసియా ప్లేయర్‌ చేతిలో ఓటమి

క్వార్టర్‌ ఫైనల్లో సింధు, సైనా  ఇండియా ఓపెన్‌ టోర్నీ

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సంచలనం నమోదైంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీ  పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ కిడాంబి శ్రీకాంత్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. మలేసియాకు చెందిన అన్‌సీడెడ్‌ ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌ వరుస గేముల్లోనే రెండో సీడ్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు, నాలుగో సీడ్‌ సైనా నెహ్వాల్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, సమీర్‌ వర్మ, సాయిప్రణీత్‌ క్వార్టర్స్‌ చేరగా... మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రాతో జత కట్టిన తెలుగు తేజం సిక్కి రెడ్డి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

ఖేల్‌ ఖతం... 
రెండో సీడ్‌ శ్రీకాంత్‌ ఆశ్చర్యకరంగా ఓ అన్‌సీడెడ్‌ ఆటగాడి చేతిలో కంగుతిన్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్‌ ఆటగాడు 19–21, 17–21తో ప్రపంచ 85వ ర్యాంకర్‌ ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌  చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల సింగిల్స్‌లో సింధు, సైనా జోరు మీదున్నారు. ఇద్దరూ ప్రిక్వార్టర్స్‌ పోటీల్లోనూ అలవోక విజయాలతో ముందంజ వేశారు. టాప్‌ సీడ్‌ సింధు 21–10, 21–14తో లిండా జెట్చిరి (బల్గేరియా)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ఇండోనేసియా టోర్నీ రన్నరప్‌ సైనా నెహ్వాల్‌ 21–12, 21–11తో లిన్‌ హొజ్‌మార్క్‌ జెర్స్‌ఫెల్డ్‌ (డెన్మార్క్‌)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కశ్యప్‌ 21–19, 19–21, 21–12తో క్వాలిఫయర్‌ శ్రేయాన్‌‡్ష జైస్వాల్‌ (భారత్‌)పై గెలుపొందగా, సమీర్‌ వర్మ 21–18, 19–21, 21–17తో ఇండోనేసియాకు చెందిన టామీ సుగియార్తోను ఓడించాడు. ఎనిమిదో సీడ్‌ భమిడిపాటి సాయిప్రణీత్‌ 21–10, 21–15తో హూ యున్‌ (హాంకాంగ్‌)పై నెగ్గాడు. 

డబుల్స్‌లో దూసుకెళ్తున్న సిక్కిరెడ్డి 
మహిళల డబుల్స్‌లో జరిగిన రెండో రౌండ్‌ పోరులో ఆరో సీడ్‌ సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప జంట  21–9, 21–2తో భారత్‌కే చెందిన మేఘ–సంఘమిత్ర జోడీపై అలవోక విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎనిమిదో సీడ్‌ సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా జంట 21–10, 21–19తో ప్రజక్తా సావంత్‌ (భారత్‌)–యోగేంద్రన్‌ కృష్ణన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. హైదరాబాద్‌ యువ ఆటగాడు సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జోడీ 21–13, 21–14తో మూడో సీడ్‌ తన్‌ కియన్‌ మెంగ్‌–లై పే జింగ్‌ (మలేసియా) ద్వయానికి షాకిచ్చింది. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్‌ రెడ్డి 21–11, 21–15తో తుషార్‌ శర్మ–చంద్రభూషణ్‌ త్రిపాఠిలపై గెలుపొందగా... సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట 21–13, 18–21, 20–22తో చియా బియావో–వాంగ్‌ జెకాంగ్‌ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top