జులన్ గోస్వామి.. ది గ్రేట్‌

Jhulan Goswami creates history in women cricket - Sakshi

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనోబలం, శ్రమించే గుణం, సమస్యను సవాల్‌గా స్వీకరించే తత్వం ప్రధానం. ఇలా కఠోర శ్రమ తర్వాత వరించే విజయం చాలా మధురంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న వారిలో జులన్‌ గోస్వామి ఒకరు. భారత మహిళా క్రికెట్‌లో బౌలింగ్‌ ఆల్‌ రౌండర్‌గా ప్రత్యేక స్థానం జులన్‌ సొంతం. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన జులన్ ... ఇప్పుడు ఆమె ప్రపంచ గర్వించే మహిళా బౌలర్‌ . మహిళా ప్రపంచ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ బౌలరే కాదు.. అత్యధిక వన్డే వికెట్లను సాధించిన బౌలర్‌గా కూడా గుర్తింపు సాధించారు.

1982లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని నదియా జిల్లాలో జన్మించిన జులన్.‌.. తన 13వ ఏట క్రికెట్‌ను సరదాగా ఆరంభించారు. తొలుత తన ఇంటికి దగ్గరలో అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడిన జులన్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పొడగరి అయిన ఆమె ఫాస్ట్‌ బౌలింగ్‌ను వేస్తుంటే తోటి బాలురు మాత్రం సునాయాసంగా ఆడేశావారంట. ఎంతలా అంటే జులన్‌‌ బౌలింగ్‌ వేస్తే చాలు సిక్స్‌లతో విరుచుకుపడేవారు. ఆ క‍్రమంలోనే నువ్వు ఫాస్ట్‌ బౌలింగ్‌కు పనికిరావంటూ కొంతమంది అబ్బాయిల్ని నుంచి కూడా ఆమెకు హేళన కూడా ఎదురైంది. కానీ అవేవీ జులన్ లక్ష్యాన్ని అడ్డుకోలేదు.. ఆమెలో మరింత పట్టుదలను తీసుకొచ్చాయి. తన కెరీర్‌లో సక్సెస్‌ రుచిని చూసిన 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు కల్గిన జులన్‌‌ గురించి మరికొన్ని విషయాలు..

1997 మహిళా వరల్డ్‌ కప్‌తో..
1997లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్‌ కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగింది. దాన్ని చూడటానికి స్కూల్‌ బృందంతో కలిసి వెళ్లిన జులన్ .. ఏదొక రోజు భారత క్రికెట్‌కు ఆడాలని బలంగా నిర్ణయించుకుందట.  ప్రధానంగా మహిళల క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లైన బెలిందా క్లార్క్‌, డెబ్బీ హాకీ, కెథరిన్‌ ఫిట్జాపాట్రిక్‌ ఆట చూసిన తర్వాత క్రికెట్‌నే లక్ష్యంగా ఎంచుకున్నారు జులన్‌. ఆనాటి గేమ్‌కు బాల్‌ గర్ల్‌ వాలంటరీగా చేసే అవకాశం కూడా జులన్ రావడం మరొక విశేషం. ఇలా పలువురు ఆటను దగ్గర్నుంచి గమనించిన ఆమె.. తన ప్రస్థానాన్ని ఫుట్‌బాల్‌ నుంచి క్రికెట్‌ వైపు మార్చుకున్నారు. తొలుత ఫుట్‌బాల్‌ కు జులన్‌‌ వీరాభిమాని. అయితే భారత్‌లో క్రికెట్‌ మినహా ఏ ఇతర క్రీడా మ్యాచ్‌లు టీవీల్లో ప్రసారమయ‍్యేవి కావు. దాంతో ఫుట్‌బాల్‌పై ఆశలు వదులుకుని, క్రికెట్‌ వైపు నడిచిన క్రీడాకారిణే మన జులన్.

'తొలి' టెస్టు సిరీస్‌ గెలుపులో మార్గదర్శి
జులన్‌‌ గోస్వామి తన అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను 2002లో ఆరంభించింది. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌ ద్వారా తొలుత వన్డేల్లో ఆరంగేట్రం చేసిన జులన్‌.. లక‍్నోలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తొలి టెస్టు ఆడింది. ఇదిలా ఉంచితే, 2006లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత మహిళల జట్టు..ఇంగ్లండ్‌పై తొలి టెస్టు సిరీస్‌ను సాధించింది. ఈ సిరీస్‌లో జులన్‌దే కీలక పాత్ర.  మిథాలీ నేతృత్వంలోని భారత జట్టు తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో విజయం సాధించింది.

తొలి టెస్టులో ఐదు వికెట్లు సాధించడంతో పాటు బ్యాటింగ్‌లో సైతం రాణించింది. తొలి ఇన్నింగ్స్‌లో 69 పరుగులతో జులన్ మెరిసింది. ఇక రెండో టెస్టులో జులన్‌‌ బౌలింగ్‌లో చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో​ ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్‌ను వణికించింది. ఫలితంగా రెండో టెస్టును భారత మహిళల జట్టు గెలిచి ఇంగ్లండ్‌ గడ్డపై కొత్త చరిత్ర సృష్టించింది. ఒకటికంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరీస్‌ల్లో భారత్‌ విజయం సాధించడం కూడా ఇదే ప్రథమం. ఇలా ఇంగ్లండ్‌ గడ్డపై భారత మహిళల జట్టు  టెస్టు సిరీస్‌ గెలుపులో జులన్ మార్గదర్శి అయ్యింది.అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ సిరీస్‌లో మాత్రమే భారత్‌ గెలిచింది.

ధోని చేతుల మీదుగా అవార్డు..
2007.. జులన్ కెరీర్‌లో మధుర జ్ఞాపకాన్ని తీసుకొచ్చిన సంవత్సరం. ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుకు ఎంపికైన ఏడాది. అప్పటికి మహిళలకు అవార్డులు ప్రవేశపెట్టి ఏడాదే కాగా, రెండో సంవత్సరంలోనే మహిళా క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు జులన్‌‌ వరించడం విశేషం. అయితే ఆ అవార్డును అప్పటి భారత పురుషుల జట్టు కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని చేతుల మీదుగా అందుకోవడడం మరో విశేషం.

జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో జులన్‌‌ను ఐసీసీ వుమెన్స్‌ అవార్డుకు ఎంపిక చేయడంతోనే కొంత ఆశ్చర్యకర పరిస్థితి చోటు చేసుకుంది. అప్పటికే భారత జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌గా రాణిస్తున్న జులన్ ఎవ్వరో చాలా మందికి తెలీదు. దాంతో జులన్ ఎవరు అనే దానిపై కాసేపు చర్చసాగింది. అయితే జులన్ అవార్డును స్వీకరించే క్రమంలో ఆమెకు ఘనమైన స్వాగతం లభించింది. కాగా, ఆ ఏడాది ఐసీసీ అవార్డులకు ఏ ఒక్క భారత పురుష క్రికెటర్‌ ఎంపిక కాకపోవడం గమనార్హం.

ఫాస్టెస్‌ మహిళా బౌలర్‌..
మహిళలు ఫాస్ట్‌ బౌలర్‌ రాణించాలంటే విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. మరి ప్రపంచ ఫాస్టెస్‌ బౌలర్‌ అనిపించుకోవాలంటే అది తలకు మించిన భారం. అయితే ఫాస్ట్‌ బౌలర్‌గానే కాకుండా వేగవంతమైన బంతుల్ని సంధించడంలో జులన్ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ కాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌ తర్వాత జులనే ఫాస్టెస్ట్‌ వుమెన్‌ బౌలర్‌. గంటకు 120 కి.మీ నుంచి 130 కి.మీ మధ్యలో బౌలింగ్‌  వేయడంలో జులన్‌‌ దిట్ట. జులన్‌‌ వేసే ఎక్స్‌ట్రా బౌన్స్‌ బంతులు ఆమెకు అదనపు బలం.

లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా..
గతేడాది వన్డే ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనతను జులన్ గోస్వామి తన ఖాతాలో వేసుకుంది. నాలుగు దేశాల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కాథరిన్‌ ఫిట్జ్‌పాట్రిక్‌(180)వికెట్ల మార్కును జులన్ అధిగమించింది. అదే ఊపును కొనసాగిస్తూ వన్డేల్లో 200 వికెట్లు సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా జులన్ ఇటీవల రికార్డు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో జులన్‌‌ రెండొందల వికెట్ల మార్కును చేరింది. మరొకవైపు అన్ని ఫార్మాట్లలో 290 వికెట్లతో భారత్‌ మహిళా జట్టు తరపున ఆల్‌ టైమ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచింది.

కెప్టెన్‌గా జులన్
2008లో తొలిసారి భారత మహిళల జట్టుగా కెప్టెన్‌గా ఎంపికైన జులన్ మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగింది. మిథాలీ రాజ్‌ నుంచి కెప్టెన్‌ పగ్గాలు అందుకున్న జులన్‌‌ 25 వన్డేలకు సారథిగా వ్యవహరించారు. అదే ఏడాది వన్డేల్లో 100 వికెట్ల మార్కును జులన్‌‌ చేరుకుని ఆ ఘనత సాధించిన నాల్గో మహిళా బౌలర్‌గా నిలిచారు. ఇక 2010లో అర్జున అవార్డు, 2012లో పద‍్మశ్రీ అవార్డును జులన్‌‌ అందుకున్నారు. కాగా, డయానా ఎడ్డుల్లి తర్వాత పద్మశ్రీ అవార్డు పురస్కారం పొందిన రెండో మహిళా క్రికెటర్‌గా జులన్‌ గుర్తింపు సాధించారు.

రోజూ 80 కి.మీ ప్రయాణం..
ఈరోజు జులన్‌‌ విజయవంతమైన భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందిందంటే దానికి ఆమె పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. తన 15 ఏటనే సీరియస్‌గా క్రికెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టిన జులన్.. రోజూ 80 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. సొంత వూరికి దగ్గరగా ప్రాక్టీస్‌ సెషన్‌ లేకపోవడంతో కోల్‌కతాకు రోజూ రైళ్లో వెళ్లి వచ్చేది. ఉదయాన్నే 4.30 ని.లకు నిద్ర లేవడం, ట్రైన్‌ పట్టుకుని కోల్‌కతాకు చేరుకోవడమే ఆమె ప్రధాన విధి.

కొన్నిసార్లు రైలు మిస్సయిన సందర్బంలో ప్రాక్టీస్‌కు దూరం కావాల్సి వచ్చేది. అయినా ఎప్పుడూ నిరాశ పడలేదు. ఈ క్రమంలోనే తల్లి దండ్రులు క్రికెట్‌ కంటే చదువుపైనే ఆసక్తిని చూపితేనే భవిష్యత్తు ఉంటుందని హితబోధ చేసేవారు. ఆ రెండింటిని ఏనాడు అలక్ష్యం చేయకుండా ముందుకు సాగిన జులన్‌ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.  తన 16 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటికీ తనదైన ముద్రతో దూసుకుపోతున్న జులన్‌.. ది గ్రేట్‌.. హ్యాట్సాఫ్ టు జులన్.
- బి. నరేష్ బాబు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top