దక్షిణాది ప్లేయర్లపైనే వర్ణ వివక్ష: పఠాన్‌

Irfan Pathan Speaks About Racism Over IPL - Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ క్రికెట్‌లో దక్షిణాది ప్లేయర్లు వర్ణ వివక్షకు గురవుతారని భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాలకు మ్యాచ్‌ల నిమిత్తం వెళ్లినపుడు వారు వర్ణానికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. ‘దక్షిణాది నుంచి వచ్చిన క్రికెటర్లలో కొందరు ఉత్తర భారతంలో వర్ణ వివక్షకు గురవుతుంటారు. అక్కడి ప్రజలు జాత్యహంకారులు కాదు కానీ ఏదో ఒకటి చేసి, ఎవరో ఒకర్ని వింత పేరుతో పిలవడం ద్వారా అందరిలో గుర్తింపు తెచ్చుకోవాలని అలా ప్రవర్తిస్తారు’ అని పఠాన్‌ అన్నాడు.

మరోవైపు ఐపీఎల్‌ సందర్భంగా విండీస్‌ ప్లేయర్‌ డారెన్‌ స్యామీ వర్ణ వివక్ష వ్యాఖ్యలకు గురైన అంశం తనకు తెలియదని ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. ‘2014లో స్యామీతో పాటు నేనూ సన్‌రైజర్స్‌కు ఆడాను. అప్పట్లో ఈ అంశంపై ఎలాంటి చర్చ జరుగలేదు. ఇది నిజంగా జరిగి ఉంటే కచ్చితంగా చర్చనీయాంశమయ్యేది. కాబట్టి నాకు దీనిపై అవగాహన లేదు’ అని ఇర్ఫాన్‌ వివరించాడు. అప్పట్లో రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన పార్థివ్‌ పటేల్, వేణుగోపాలరావు కూడా స్యామీపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top