అమ్మ... నాన్న... ఇకపై కుదరదు 

IOA rejects fathers and mothers - Sakshi

క్రీడాకారుల తల్లిదండ్రులకు అక్రిడిటేషన్లు ఇవ్వం

భారత ఒలింపిక్‌ సంఘం స్పష్టీకరణ

న్యూఢిల్లీ: ‘క్రీడాగ్రామంలో మా నాన్నను అనుమతించే అక్రిడిటేషన్‌ కార్డు ఇవ్వకుంటే నేను కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఆడను’ అని బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ గోల్డ్‌కోస్ట్‌ ఈవెంట్‌ సందర్భంగా కరాఖండీగా చెప్పింది. దీంతో ఐఓఏ ఆగమేఘాలమీద సైనా తండ్రికి అక్రిడిటేషన్‌ వచ్చేలా చేసింది. అయితే ఇది వివాదానికి దారితీసింది. నాన్నకు ఇవ్వనంత మాత్రాన దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చే ప్రతిష్టాత్మక గేమ్స్‌ను పణంగా పెట్టడమేంటని నెటిజన్లు, క్రీడా వర్గాలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు, చురకలు అంటించారు. ఇది అప్పటి సంగతి. మరీ వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌లో ఇండోనేసియాలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. కాబట్టి ఈ వివాదాలకు తావివ్వరాదని గట్టిగా భావించిందో... ఏమో గానీ.. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కీలక నిర్ణయాన్ని వెలువరించింది. క్రీడాకారుల తల్లిదండ్రులకు ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రిడిటేషన్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. అయితే సహాయక బృందంలో కోచ్, ఫిజియో, ట్రెయినర్‌లలో ఎవరైనా తల్లిదండ్రులు, భర్త, భార్య, రక్తసంబంధీకులు ఉంటే అక్రిడిటేషన్లు ఇచ్చేందుకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఇక ఆసియా గేమ్స్‌కు ఐఓఏ ఏకంగా 900 మందితో కూడిన జంబో జట్టును పంపే ప్రణాళికలో ఉంది. 

2032 ఒలింపిక్స్‌పై భారత్‌ ఆసక్తి 
భవిష్యత్‌లో అంతర్జాతీయ గేమ్స్‌ నిర్వహణపై భారత ఒలింపిక్‌ సంఘం తెగ ఆసక్తి కనబరుస్తోంది. వచ్చే 14 ఏళ్లలో ఏకంగా మూడు మెగా ఈవెంట్లకు ఆతిథ్యమిచ్చేందుకు బిడ్లు దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. 2026లో యూత్‌ ఒలింపిక్స్‌ను వాణిజ్య రాజధాని ముంబైలో... 2030 ఆసియా క్రీడలతోపాటు 2032 ఒలింపిక్స్‌ను దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించాలనే ఆసక్తిని ఐఓఏ వ్యక్తం చేసింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top