త్వరలో ప్రారంభం కానున్న ఖతార్ ఓపెన్ కు రష్యన్ స్టార్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా దూరం కానుంది.
మాస్కో: త్వరలో ప్రారంభం కానున్న ఖతార్ ఓపెన్ కు రష్యన్ స్టార్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా దూరం కానుంది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న షరపోవా.. ఖతార్ ఓపెన్లో పాల్గొనడం లేదని ఆ టోర్నీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా సెరెనా విలియమ్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ అనంతరం గాయం కారణంగా మరియా ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. గత వారం జరిగిన ఫెడ్ కప్ లో షరపోవాకు రష్యన్ స్క్వాడ్ లో చోటు కల్పించినా ఆమె వైదొలిగింది.
'నేను ఖతార్ ఓపెన్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేను. నా ఎడమ మోచేతి గాయంతో బాధపడుతున్నా. దాంతో టోర్నీకి దూరంగా కావాల్సి వస్తుంది' అని ఖతార్ ఓపెన్ నిర్వహకులు అందజేసిన నివేదికలో షరపోవా పేర్కొంది. టెన్నిస్ కు ఎక్కువ మంది అభిమానులున్న దోహాలో తాను ఆడకపోవడం నిరాశగురౌతున్నట్లు తెలిపింది. ఈ టోర్నీలో వచ్చే ఏడాది ఆడతానని ఆశిస్తున్నట్లు షరపోవా పేర్కొంది.