మెరుపుల్లేవ్‌... చినుకులే!

India vs Sri Lanka Match Called Off Due To Rain - Sakshi

భారత్, లంకల తొలి టి20 రద్దు

అసౌకర్యాలపై అభిమానుల నిరాశ

ముంచెత్తిన వాన

కవర్లకు చిల్లులు, తడిసిన పిచ్‌

హెయిర్‌ డ్రయర్, ఐరన్‌ బాక్స్‌లతో పిచ్‌ను ఆరబెట్టే యత్నం

అందరూ అనుకున్నట్లుగా టి20 ప్రపంచకప్‌ ఏడాది భారత్‌ తొలి అడుగు మెరుపులతో పడలేదు. ప్రత్యర్థి శ్రీలంక కోరుకున్నట్లుగా ఆతిథ్య జట్టు పరాజయం పాలవ్వలేదు. ఎవరూ ఊహించనట్లుగా చినుకులు మైదానాన్ని ముంచెత్తాయి. కప్పి ఉంచిన కవర్లకేమో చిల్లులు పడ్డాయి. అసలు ఒక్కబంతి అయినా పడకుండానే మ్యాచ్‌ రద్దయ్యింది.   

గువాహటి: టాస్‌ పడనైతే పడింది... కానీ బంతి పడలేదు. బ్యాట్‌ బరిలోకే దిగలేదు! 2020లో తొలి టి20 మెరుపులపై... అభిమానుల ఆసక్తిపై నీళ్లు చల్లుతూ వరుణుడు ముంచెత్తాడు. దీంతో భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇక్కడి బర్సపర అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరగాల్సిన తొలి టి20 మ్యాచ్‌ రద్దయ్యింది. అస్సాం క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వాకం కూడా ఈ రద్దులో ఓ భాగమైంది. చిల్లులున్న కవర్లతో పిచ్‌ను కప్పి ఉంచగా... కురిసిన నీరు కురిసినట్లుగా పిచ్‌లోకి ఇంకింది. దీంతో తడిసి ముద్దయిన పిచ్‌పై మ్యాచ్‌ అసాధ్యమని అంపైర్లు తేల్చేశారు. టి20ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో, రాష్ట్ర క్రికెట్‌ సంఘంపై అసంతృప్తితో భారంగా మైదానం వీడారు. మంగళవారం ఇండోర్‌లో రెండో టి20 మ్యాచ్‌ జరగనుంది.

ఆసక్తిగా స్టేడియానికొస్తే...
విజయంతో ఈ కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభిద్దామని ఇటు టీమిండియా... ఎంతో ఆసక్తిగా ప్రత్యక్షంగా మెరుపుల మ్యాచ్‌ చూడాలని అటు అభిమానులు స్టేడియానికి వస్తే... అకాల వర్షం అమాంతం ముంచెత్తింది. టాస్‌ వేశాక... ఆటగాళ్లు బ్యాట్‌తో మెరుపులు మెరవాల్సిన చోట వరుణుడు చినుకులు కురిపించాడు. దీంతో ఎంతసేపటికీ ఆట మొదలేకాలేదు. కనీసం కుదించిన ఓవర్ల మ్యాచ్‌ అయిన జరుగుతుందని ప్రేక్షకులు వర్షంలో తడుస్తూ ఎదురుచూసినా... స్టేడియం సిబ్బంది నిర్లక్ష్యంతో ఆ ముచ్చటా తీరలేదు.

అంపైర్లతో అసహనం వ్యక్తం చేస్తున్న కోహ్లి

స్టేడియం సిబ్బంది చిల్లులు పడిన కవర్లను పిచ్‌పై కప్పేసింది. అదేమో వాననీటితో తడిపేసింది. ఈ నిర్లక్ష్యం ఓ మ్యాచ్‌నే నష్టపరచలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో ధనం, పలుకుబడి ఉన్న బీసీసీఐ పరువును గంగలో కలిపేసింది. మరీ చౌకబారుగా స్టేడియం సిబ్బంది శ్రమించిన తీరు తీవ్ర విమర్శల పాలైంది. హెయిర్‌ డ్రయర్‌ (వెంట్రుకలను ఆరబెట్టే మెషిన్‌)తో, బట్టలను ఇస్త్రీ చేసుకునే ఐరన్‌ బాక్స్‌లతో పిచ్‌ను ఆరబెట్టే పనిచేయడం అస్సాం క్రికెట్‌ సంఘాన్ని నవ్వుల పాలు చేసింది.

దండిగా డబ్బులున్నా...
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురించి ఎప్పుడు చెప్పుకున్నా... తొలి మాట అత్యంత ధనవంతమైన బోర్డు అనే. ఇంతటి సుసంపన్నమైన బోర్డుకు అనుబంధమైన రాష్ట్ర సంఘంలో ఇదేం దుస్థితి అనే విమర్శలు వెల్లువెత్తాయి. చాలా ఏళ్లుగా బోర్డు రాష్ట్ర సంఘాలన్నింటికీ విరివిగా నిధులు పంపిణీ చేస్తోంది. ఇవి ఏ వేలల్లో... లక్షల్లో కాదు ఏకంగా కోట్లలోనే నిధులిస్తుంది. అంత పెద్ద మొత్తంలో నిధులు అందుకునే క్రికెట్‌ సంఘం వద్ద పిచ్‌ను కప్పే నాణ్యమైన కవర్లే ఉండవా అనేది కొన్ని కోట్ల మెదళ్లను తొలిచే ప్రశ్న.

హెయిర్‌ డ్రయర్‌తో పిచ్‌ను ఆరబెడుతున్న వ్యక్తికి కోహ్లి సూచనలు

అస్సాం సంఘం తీరు మరీ ఇంత అధ్వాన్నంగా ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. మ్యాచ్‌ను నిర్వహిస్తే క్రికెట్‌ అభిమానులకు వినోదమే కాదు... ప్రకటనల రూపేణా ప్రసారకర్తకు, టికెట్లు, గ్రౌండ్‌ రైట్స్‌ రూపంలో రాష్ట్ర సంఘానికి కోట్లలో డబ్బు వచ్చేది. ఇప్పుడు ఒక్క బంతి అయిన పడకపోవడంతో అమ్ముకున్న టికెట్ల డబ్బును కూడా తిరిగి చెల్లించే పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నిక్కచ్చిగా వ్యవహరించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మాత్రం కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ మ్యాచ్‌ నిర్వహణ ఉండనే ఉండదు. అదే జరిగితే అస్సాం క్రికెట్‌ సంఘం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top