నేటి నుంచి ‘నంబర్‌వన్’ పోరాటం | India - Australia cricket series to start from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘నంబర్‌వన్’ పోరాటం

Oct 13 2013 8:25 AM | Updated on Sep 1 2017 11:36 PM

నేటి నుంచి ‘నంబర్‌వన్’ పోరాటం

నేటి నుంచి ‘నంబర్‌వన్’ పోరాటం

చాంపియన్స్ ట్రోఫీ, ముక్కోణపు సిరీస్, జింబాబ్వేతో వన్డే సిరీస్...ఇలా గత మూడు వన్డే టోర్నీలు చూస్తే భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతుంది.

మ. గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

 ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్.... ఈ హోదా ఉన్న జట్టు ఎలా ఆడాలో భారత్ అలాగే ఆడుతోంది. వన్డేల్లో ఇటీవల కాలంలో ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించగలమనే ధీమాను చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఏడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చింది. అది కూడా 6-1తో సిరీస్ గెలిస్తే నంబర్ వన్ ర్యాంక్ సాధించొచ్చు అనే లక్ష్యంతో. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి చూస్తే... కనీసం 4-3తో సిరీస్ గెలవడం కూడా అద్భుతమే అనుకోవాలి.
 
 
 పుణే: చాంపియన్స్ ట్రోఫీ, ముక్కోణపు సిరీస్, జింబాబ్వేతో వన్డే సిరీస్...ఇలా గత మూడు వన్డే టోర్నీలు చూస్తే భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతుంది. ఏ ఒక్కరిపైనో ఆధార పడకుండా జట్టులో ప్రతీ ఒక్కరూ తమ బాధ్యత సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. దాంతో ఎలాంటి తడబాటు లేకుండా విజయాలు ధోనిసేన వశమవుతున్నాయి.
 
 కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కచ్చితంగా భారత్ ఫేవరెట్. టి20 మ్యాచ్‌లో ఏకంగా 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్... వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అసలే అనుభవం లేని ఆటగాళ్లతో ఇబ్బంది పడుతున్న కంగారూలు ఈ సిరీస్ గెలవాలంటే అద్భుతాలు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం పుణేలోని సుబ్రతోరాయ్ సహారా స్టేడియంలో జరుగుతుంది.
 

 సమష్టితత్వం...
 టి20లో సంచలన విజయం సాధించిన జట్టుతోనే భారత్ తొలి వన్డేలోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి రాయుడు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, ధోని, జడేజాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక టి20 మ్యాచ్‌లో 35 బంతుల్లోనే అజేయంగా 77 పరుగులతో చెలరేగి యువరాజ్ ఫామ్‌లోకి రావడం భారత్ బలాన్ని మరింత పెంచింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా టి20 కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వన్డేల్లో భువనేశ్వర్, అశ్విన్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కూడా చాలా కాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. స్పిన్నర్లను ఎదుర్కోలేని ఆసీస్ కొత్త కుర్రాళ్ల బలహీనతను భారత బౌలర్లు సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన గత రెండు వన్డేల్లోనూ ధోని టీమ్ గెలిచింది. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ (2011) తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో వన్డే ఆడలేదు.
 
 వాట్సన్ మినహా...
 క్లార్క్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కొరత ఏర్పడింది. అందులోనూ భారత గడ్డపై ఎవరూ పెద్దగా ఆడింది లేదు. జట్టులో వాట్సన్, మిచెల్ జాన్సన్‌లకే వందకుపైగా వన్డేలతో పాటు ఐపీఎల్‌లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. దాంతో వాట్సన్‌పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధార పడింది.
 
 ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్ నెగ్గడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. అయితే టి20 తరహాలో కాకుండా 50 ఓవర్ల పాటు ఆసీస్ నిలబడటం కీలకం. కెప్టెన్ బెయిలీ, ఫించ్, వన్డే స్పెషలిస్ట్ వోజెస్, ఫెర్గూసన్ ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్. మెక్‌కే, ఫాల్క్‌నర్, కౌల్టర్, వాట్సన్ ప్రధాన బౌలర్లు. ఆల్‌రౌండర్‌గా మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.  సమర్ధుడైన స్పిన్నర్ లేకపోవడం ఆసీస్ బలహీనత. జట్టులో డోహర్తి ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్ కాగా, భారత్‌పై లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యం లో తొలి వన్డేకు ముందు అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యంలో కనిపిస్తోంది.
 
 జట్లు (అంచనా)
 భారత్: ధోని(కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, వినయ్ కుమార్.
 
 ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, హాడిన్, మెక్‌కే, జాన్సన్, ఫాల్క్‌నర్, డోహర్తి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement