
చెన్నై: మ్యాచ్‌లను ముగించడంలో మహేంద్ర సింగ్ ధోని యూనివర్సిటీ టాపరైతే తానింకా విద్యార్థినేనని నిదహస్ ట్రోఫీ ఫైనల్ హీరో దినేశ్ కార్తీక్ అంటున్నాడు. ధోనిని చూస్తూ ఎదిగినవారిలో తానూ ఒకడినని, ఇద్దరి ప్రయాణాలు వేర్వేరని పేర్కొన్నాడు. మంగళవారం చెన్నైలో దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు.
‘ధోని అద్భుతమైన వ్యక్తి. ఒకప్పుడు సిగ్గరిగా ఉన్న అతడు నేడు యువకులకు అండగా నిలిచే వ్యక్తిగా మారాడు. తనతో నన్ను పోల్చడం సరికాదు. ప్రస్తుతం అందరూ నా గురించి మాట్లాడుతున్నారు. దీనిని మాటల్లో వర్ణించలేను. ఇదంతా కొన్నేళ్ల శ్రమ ఫలితం. నేనున్న స్థితి గురించి సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడిక కొత్తగా ఏం చేయనున్నానో చూస్తారు’ అని అన్నాడు.