ధోని మమ్మల్ని లెక్క చేయలేదు! | I'm confident MS Dhoni will continue to contribute: Pune owner Sanjiv Goenka | Sakshi
Sakshi News home page

ధోని మమ్మల్ని లెక్క చేయలేదు!

Feb 22 2013 12:52 AM | Updated on Sep 5 2017 4:16 AM

ధోని మమ్మల్ని లెక్క చేయలేదు!

ధోని మమ్మల్ని లెక్క చేయలేదు!

ఒక్క సీజన్‌లో జట్టు ప్రదర్శన బాగా లేకపోయినంత మాత్రాన ధోనిలాంటి దిగ్గజ కెప్టెన్‌ను ఎవరైనా తప్పిస్తారా!

అందుకే కెప్టెన్సీ నుంచి తప్పించాం 
పుణే యజమాని గోయెంకా సంచలన వ్యాఖ్యలు   


పుణే: ఒక్క సీజన్‌లో జట్టు ప్రదర్శన బాగా లేకపోయినంత మాత్రాన ధోనిలాంటి దిగ్గజ కెప్టెన్‌ను ఎవరైనా తప్పిస్తారా! పుణే జట్టు అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించిన దగ్గరి నుంచి అభిమానుల మదిలో ఇదే ప్రశ్న. మార్పు కోసమే అంటూ స్మిత్‌ను ఎంపిక చేయడంకంటే దీని వెనక మరో బలమైన కారణం ఉండవచ్చని అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌ జట్టు యజమాని సంజీవ్‌ గోయెంకా అనేక విషయాలు వెల్లడించారు. ధోని గురించి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు యజమానులైన తమను ధోని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని అర్థమవుతోంది. ఒక బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో గోయెంకా మాట్లాడుతూ... ‘ధోని మాకు ఫోన్‌లో కూడా ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఫ్రాంచైజీ కీలక సమావేశాలకు కూడా అతను రాలేదు. అతనితో మాట్లాడాలనుకున్న ప్రతీసారి ఏజెంట్‌ అరుణ్‌ పాండే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది.

గత ఏడాది లీగ్‌ సమయంలో అతను టీమ్‌ మీటింగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. ఇందులో చర్చించిన ఫీల్డింగ్‌ను ధోని మ్యాచ్‌లో పూర్తిగా మార్చేశాడు. అతను ఆ సమావేశంలో లేకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా ధోనీకి తెలీదని ఒక సీనియర్‌ ఆటగాడు మాకు చెప్పాడు’ అని గోయెంకా కుండబద్దలు కొట్టారు. జట్టు నెట్‌ ప్రాక్టీస్‌లకు కూడా మహి హాజరు కాలేదని, లెగ్‌స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను తుది జట్టులోకి తీసుకోమంటే తాను అతని ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని పుణే యాజమాన్యం పేర్కొంది.

దేశవాళీలో మంచి ప్రదర్శన లేకపోయినా ఫ్రాంచైజీపై ఒత్తిడి తెచ్చి తన జార్ఖండ్‌ రాష్ట్రానికే చెందిన సౌరభ్‌ తివారిని బలవంతంగా జట్టులోకి తీసుకోవడంతో పాటు టీమ్‌ జెర్సీ రంగు, డిజైన్‌కు సంబంధించి ధోని ఇచ్చిన సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదు. క్రికెటేతర అంశాల్లో కూడా అతను జోక్యం చేసుకొనేంత అధికారం ధోని చేతుల్లో ఇవ్వరాదని ఆర్‌పీజీ టీమ్‌ భావించింది. దాంతో మార్పు అనివార్యమంటూ జనవరిలోనే ధోనికి సమాచారం ఇవ్వగా, ‘మీరు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి. ఇది మీ నిర్ణయం. నేను ఆటగాడిగానే ఉంటాను’ అని ధోని అప్పుడే చెప్పినట్లు తెలిసింది. ‘సామాన్య అభిమానులకు ఈ నిర్ణయం నచ్చదని మాకు తెలుసు. అయితే ఇదే సరైంది. నేను నిజాలను ఎప్పుడైనా మొహం మీదే చెప్పేస్తాను. ఫ్రాంచైజీ మేలు కోసమే ధోనిని తప్పించాం’ అని గోయెంకా స్పష్టం చేశారు.

జార్ఖండ్‌ కెప్టెన్‌గా తొలిసారి...: ఐపీఎల్‌లో కెప్టెన్సీకి దూరమైన రెండు రోజులకే ధోని తన సొంత రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 25 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో ధోని జార్ఖండ్‌ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టును మంగళవారం ప్రకటించారు. భారత్‌కు 331 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 143 ఐపీఎల్‌లో మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని జార్ఖండ్‌కు తొలిసారి కెప్టెన్‌ కావడం విశేషం. గత ఏడాది కూడా ఈ టోర్నీ ఆడిన ధోని... వరుణ్‌ ఆరోన్‌ కెప్టెన్సీలో ఆడాడు. 


గతేడాది టీమ్‌ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో గోయెంకా, ధోని (ఫైల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement